– కబ్జాకు గురైన 1600 గజాలు స్వాధీనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఒక ప్రజాప్రతినిధి అండతో కబ్జాకు గురైన అత్యంత విలువైన పార్క్ స్థలాన్ని అధికారులు విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రజల సౌకర్యార్థం కేటాయించిన స్థలాలను అక్రమంగా ఆక్రమిస్తే ఊరుకునేది లేదని ఈ చర్య ద్వారా అధికారులు స్పష్టమైన హెచ్చరికలు పంపారు. నార్సింగిలోని అరుణోదయ హౌసింగ్ సొసైటీలో సుమారు 1,600 గజాల విస్తీర్ణం కలిగిన పార్క్ స్థలాన్ని ఒక ప్రజాప్రతినిధి అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఆక్రమణదారులు ఆ స్థలం చుట్టూ భారీ ప్రహరీ గోడను నిర్మించి, దానిని తమ వ్యక్తిగత ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఈ కబ్జాపై స్థానిక నివాసితుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు తక్షణమే స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను జెసిబిలతో కూల్చివేసి ఆక్రమణలను తొలగించారు. అనంతరం ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. కోట్ల రూపాయల విలువైన పార్క్ స్థలం కబ్జాకు గురవుతున్నా స్థానిక మున్సిపల్ అధికారులు నోరు మెదపకపోవడంపై హౌసింగ్ సొసైటీ సభ్యులు, స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారుల అండదండలు లేనిదే ఇంత పెద్ద మొత్తంలో స్థలం కబ్జాకు గురికాదని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ హైడ్రా జోక్యంతో తమ పార్క్ స్థలం తిరిగి తమకు దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.