మూసీలో మార్కింగ్ చేపట్టడం లేదు
ఇదంతా మూసీ రివర్ ఫ్రంట్ కార్యక్రమం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: మూసీ సుందరీకరణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. మూసీ నది పరిధిలో నివసిస్తున్న వారిని హైడ్రా తరలించడం లేదని, నదిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని, మూసీ సుందరీకరణ అనేది ప్రత్యేక ప్రాజెక్టని చెప్పారు. దానిని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని వెల్లడించారు.
మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఆందోళనలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. మూసీ నదికి ఇరువైపులా జరుగుతున్న సర్వేలు హైడ్రాకు సంబంధించినవి కాదని తెలిపారు మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని ఆయన తెలిపారు. ఇది నివాసితుల కష్టాలను, అసౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్నదని స్పష్టం చేశారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.





