ఆ భూముల్లో హైడ్రాకు అడుగుపెట్టే హక్కు లేదు

– హైకోర్టు న్యాయవాది ముఖిమ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బలహీనవర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతున్నదని హైకోర్టు న్యాయవాది ముఖిమ్ అన్నారు. హైడ్రాపై ధ్వజమెత్తిన న్యాయవాది ముఖీమ్ మాకు అనుకూలమైన డిక్రీ ఉందని, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు ఐలాపూర్ భూములలో ప్రవేశించే హక్కు లేదని అన్నారు. ఐలాపూర్ భూముల్లో హైడ్రా అధికారులు వాహనాలలో నిత్యం తిరుగుతూ గ్రామస్తులను, ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న ఐలపూర్ భూములపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టిన అమీన్ పూర్ రెవెన్యూ అధికారుల చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. సంవత్సరం క్రితం ఐలాపూర్ రాజగోపాల్ నగర్ పేరుతో నూతనంగా ఏర్పడిన సొసైటీ హైడ్రా అధికారి రంగనాథ్ తో కలిసి ఐలాపూర్ భూములలో భారీ భూ కుంభకోణానికి తెరలేపినట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని, త్వరలోనే ఆ గుట్టు రట్టు చేస్తామని ముఖీమ్ అన్నారు. ఐలాపూర్ భూముల
వ్యవహారంలో రిట్ అప్పీల్ పెండింగ్ ఉందని రిట్ అప్పీల్ ద్వారా హైడ్రా అధికారులు ఐలపూర్ భూముల్లోకి ప్రవేశించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా అధికారి రంగనాధ్ జోక్యం తగదని హైడ్రా తన నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు. గ్రామస్తులను ఉద్దే శించి మాట్లాడుతూ.. ఎవరూ హైడ్రాకు భయ పడవద్దని న్యాయస్థానాలు మనకు రక్షణ కవ చంలా ఉన్నాయని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఐలాపూర్ భూముల రైతుల పక్షాన గళం వినిపించేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఐలాపూర్ భూముల వ్యవహారంలో హైడ్రా, రెవెన్యూ అధికారులు నిబంధనలకు అనుగుణంగా సంయమనంతో పనిచేసే విధంగా ఆయా శాఖ లను కట్టడి చేయాలని గ్రామస్తులను భయ భ్రాం తులకు గురి చేయకుండా కేసులు తుది తీర్పు వచ్చేంతవరకు రైతులను ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. కోర్టు పరిధిలో లేని వివాదాస్పదం కాని భూముల వ్యవహారంలోకి హైడ్రా, రెవెన్యూ, రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకోవద్దని ఎమ్మార్పీఎస్ తరఫున విజ్ఞప్తి, సూచన చేశారు. రైతులకు ఉండే చట్టబద్ధమైన హక్కులను హైడ్రా కాలరాయొద్దని, ఆ భూములలో వ్యవసాయం, నిర్మాణాలు చేసుకునే హక్కులు వారికి ఉంటాయని ప్రభుత్వానికి హితవు పలికారు. హైడ్రా పరిధిని ప్రశ్నిస్తూ నిబంధనలకనుగుణంగా ఈ సంస్థ పని చేస్తున్నదా లేదా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలని కోరారు. హైడ్రా తన పరిధి మించి వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దానిని అరికట్టే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలో ఉన్నదని అన్నారు. హైడ్రా తన పరిధిని విస్మరించి వ్యవహరించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి ఉన్నదని వినిపిస్తున్న ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా పారదర్శకతను నిరూపించుకునే అవసరం ఎంతైనా ఉన్నదని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐలాపూర్ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *