హైకోర్టుకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ క్షమాపణ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (ఆర్‌ఎన్‌ఎ): హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలంగాణ హైకోర్టుకు హాజరై క్షమాపణ చెప్పారు. బతుకమ్మకుంట కేసు విచారణలో భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ కేసులో హైడ్రాపై ఎ.సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో రంగనాథ్‌ శుక్రవారం కోర్టుకు వచ్చారు. గతంలోనే హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. దీంతో హైకోర్టు తీవ్రంగా పరిగణించి ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌ బతుకమ్మకుంట పరిధిలోని ప్రైవేటు స్థలానికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని జూన్‌ 12న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అక్టోబరు 31న విచారించిన హైకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో నవంబరు 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే బాచుపల్లిలో అత్యవసర పనులు ఉన్నందున హాజరుకాలేకపోతున్నానంటూ మినహాయింపు కోరుతూ రంగనాథ్‌ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ మౌసవిూ భట్టాచార్య, జస్టిస్‌ బి.ఆర్‌.మధుసూదన్‌రావులతో కూడిన ధర్మాసనం నవంబర్‌ 27న విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్‌ ఊరిళ్ల వాదనలు వినిపిస్తూ తప్పనిసరి అధికారిక విధులతోపాటు, తన హాజరుతో కోర్టును ఇబ్బంది పెట్టరాదన్న కారణంగా మినహాయింపు కోరుతున్నారనగా ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ ఆయన కోర్టు పట్ల చూపిన దయకు అభినందనలు తెలియజేస్తున్నామని వ్యాఖ్యానించింది. కోర్టు తలచుకుంటే ధిక్కరణను ఎదుర్కొంటున్న కమిషనర్‌ను ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో నిలబెట్టగలదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. హాజరు మినహాయింపునకు నిరాకరిస్తూ కమిషనర్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్‌ శుక్రవారం హైకోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *