– రెండు వేల గజాల స్థలాన్ని కాపాడిన ’హైడ్రా‘
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు చేరువలో ప్రధాన రహదారికి ఆనుకుని ఆక్రమణకు గురైన భూమిని హైడ్రా కాపాడిరది. రెండు వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుంది. రెండు దశాబ్దాలుగా కబ్జాకు గురైన భూమికి హైడ్రా సోమవారం విముక్తి కల్పించింది. జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లే ఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించినది. అయితే పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి ఆక్రమించి ఇంటి నంబరు కల్పించి అందులో నర్సరీ నడుపుతున్నాడు. ఈయనపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. జీహెచ్ ఎంసీ పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించి స్టేటస్‌కో తెచ్చుకున్నాడు. స్టేటస్‌కో ఉన్నపుడు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు…నర్సరీ నడపరాదు.. కానీ అనుమతి లేని షెడ్ల నిర్మాణాలు, నర్సరీ వ్యాపారాన్ని నిర్వహించారు.
ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు..
కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ అవకతవకలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. లే ఔట్ ప్రకారం ప్రజావసరాలకుద్దేశించిన స్థలంగా నిర్ధారించి నర్సరీ నిర్వహిస్తున్న సత్యనారాయణకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై తిరిగి హైకోర్టును ఆశ్రయించిన సత్యనారాయణకు అక్కడ చుక్కెదురైంది. గతంలో ఉన్న స్టేటస్‌కోను కూడా కొట్టేసి హైడ్రా తీసుకోబోయే చర్యలకు హైకోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలతో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నర్సరీలో మొక్కలను తరలించుకునేందుకు అవకాశం ఇచ్చి అక్కడ షెడ్లతోపాటు ఆక్రమణలను తొలగించింది. దీంతో 2000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు పేర్కొంటూ బోర్డులు పెట్టింది. హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాధ్‌తోపాటు పాలకమండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా తాము చేస్తున్న న్యాయ పోరాటం ఫలించిందని పేర్కొన్నారు. రూ.వంద కోట్ల స్థలాన్ని కబ్జాదారుల నుంచి విడిపించినందుకు ప్రభుత్వానికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ అధికారులకు సొసైటీ ప్రెసిడెంట్, పాలకమండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




