‘Hydra’: వందేళ్ల‌ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం

– హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు
– తమ సంస్థపై ప్రజలకు మరింత స్పష్టత రావాలి
-‘మీట్‌ ది ప్రెస్‌’లో కమిషనర్‌ రంగనాథ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23 : హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదని, వందేళ్ల‌ ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు. హైడ్రా లాంటి సంస్థ దేశంలో మరెక్కడా లేదని, హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాలని అన్నారు. బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో శనివారం తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ఏడాది కాలంలో హైడ్రా ‘మహానగర అభివృద్ధి – ఆటంకాలు’ అనే అంశంపై నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమానికి రంగనాధ్‌ హాజరై మాట్లాడారు. గత ఏడాది జూలైలో ప్రభుత్వం హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఆండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)ను ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ది చేస్తున్నామన్నారు. సీఎస్‌ఆర్‌ పేరుతో చెరువులను అక్రమించుకోడానికి ప్రయత్నం చేశారని, అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళను రానివడం లేదని అన్నారు. అన్ని సాంకేతిక ఆధారాలతో చెరువుల ఎఫ్‌టీఎల్‌ మార్కింగ్‌ చేస్తున్నామన్నారు. చెరువుల వద్ద భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయన్నారు. జిహెచ్‌ఎంసి యాక్ట్‌లో మార్పులు చేసి తమకు సంబంధించిన అధికారాలు ప్రభుత్వం కల్పించిందన్నారు. తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ బాగానే పనిచేస్తున్నామన్నారు. తమవైపు తప్పు జరిగితే సమీక్షించుకుంటామని, హైడ్రాకు ప్రభుత్వం నుంచి చాలా సపోర్ట్‌ ఉందని తెలిపారు. వరదల్లో కొన్ని ప్రాంతాల్లో మురుగు బయటకు వస్తున్నదని, అలాంటి విషయాల్లో పరిష్కారం కోసం పనిచేయడం ముఖ్యమని భావిస్తున్నామన్నారు. హైడ్రాకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ముఖ్యమైన విషయమని, పర్యావరణ పరిరక్షణ కోసం ఎక్కువ పనిచేస్తున్నామని చెప్పారు. నాలాల్లో వేలాది ట్రక్కుల పూడికతీత పనులు చేస్తున్నామని, వర్షం లేనప్పుడు హైడ్రా సిబ్బందితో నాలాలు, మ్యాన్‌ హోల్స్‌ శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. చెరువుల్లో కూల్చివేతల సమయంలో చాలా ఆరోపణలు వచ్చాయన్నారు. బతుకమ్మ కుంట, కూకట్‌పల్లి చెరువులను బాగా అభివృద్ధి చేస్తున్నామని, దీంతో అక్కడి వారు సంతోషిస్తున్నారని తెలిపారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో ఫోర్‌కాస్ట్‌లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, కానీ ఇప్పుడు చేస్తున్న పనులు వచ్చే వందేళ్లకు ఉపయోగపడతాయని చెప్పారు. 60 నుంచి 65 శాతం చెరువులు మాయం అయ్యాయని తెలిపారు. సీఎస్‌ఆర్‌ కింద చెరువులు కొట్టేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చెరువుల మాదిరిగా నాలాల కబ్జాలు నిరోధించేందుకు వాటిని నోటిఫై చేస్తామన్నారు. నాలాల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్‌ అలీ ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా వ్యవహరించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ స్వాగతం పలికారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి స్వాగతోపన్యాసం చేసారు. ఐజేయు స్టీరింగ్‌ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్‌, జాతీయ కార్యదర్శి వై.నరేందర్‌ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి, కోశాధికారి మోతె వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేష్‌, హెచ్‌యూజే అధ్యక్షుడు శిగ శంకర్‌ గౌడ్‌, కార్యదర్శి హమీద్‌ షౌకత్‌, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్‌ బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్‌లతోపాటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలకు చెందిన దాదాపు 90మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *