ప్రభుత్వ అధీనంలోకి హైదరాబాద్ మెట్రో

– అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదం
– మెట్రో విస్తరణకు మార్గం సుగమం
– తీర్మానం ప్రవేశపెట్టిన సిఎం రేవంత్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలని రాష్ట్ర‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ చరిత్రాత్మక నిర్ణయంతో మెట్రో రైలు ఇకపై పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆస్తిగా మారిపోనుంది. నగరవాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సాహసోపేతమైన అడుగు వేసింది. మెట్రో స్వాధీన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ విస్తరణ కోసమే మెట్రోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి దాదాపు అన్ని పక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 31 నుంచి మెట్రో రైలును నడిపించేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో మెట్రో నెట్వర్క్‌ను భారీగా విస్తరించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతం ఫేజ్-1 ప్రైవేట్ నిర్వహణలో ఉండటం వల్ల చేపట్టబోయే ఫేజ్-2 పనులకు అనేక సాంకేతిక, చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన కొన్ని నిబంధనలను పరిష్కరించాలన్నా, మెట్రో విస్తరణ వేగంగా జరగాలన్నా మొత్తం నెట్వర్క్ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం అత్యవసరమని ముఖ్యమంత్రి సభలో వివరించారు. అందుకే ఎల్ అండ్ టీ నుండి మెట్రో ఫేజ్-1ను ’హైదరాబాద్ మెట్రో రైల్వే లిమిటెడ్ ’ ద్వారా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని వివరించారు. ఈ స్వాధీన పక్రియతోపాటు మెట్రోను నగరం నలుమూలలా విస్తరించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలను ఆవిష్కరించింది. ఫేజ్-2ఏ కింద సుమారు 76.4 కి.మీ మేర కొత్త మార్గాల నిర్మాణం చేపట్టబోతుండగాఫేజ్-2బి కింద మరో 86.1 కి.మీ విస్తరణ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ విస్తరణ పూర్తయితే హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. నగరంలో వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా మెట్రో సేవలను మెరుగుపరచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ప్రభుత్వం నేరుగా నిర్వహణ బాధ్యతలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో టిక్కెట్ ధరల నియంత్రణ, మెరుగైన సౌకర్యాలు , కొత్త మార్గాల అనుసంధానం మరింత సులభతరం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫేజ్-2 విస్తరణకు త్వరితగతిన ఆమోదం పొందేందుకు కూడా ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి మెట్రో రైలుపై ప్రభుత్వ పెత్తనం పెరగడం వల్ల సామాన్య ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని, నగరం ప్రపంచ పటంలో ఒక అత్యాధునిక రవాణా వ్యవస్థ కలిగిన మెట్రోపాలిటన్‌గా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నష్టాలతో సతమతమవుతున్నామని, మెట్రో రైలు నిర్వహణ నుంచి తప్పుకొంటామని నాలుగైదేళ్లుగా ఎల్‌అండ్‌టీ సంస్థ చెబుతోంది. ఇదే విషయాన్ని గత సెప్టెంబరులో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది. సుదీర్ఘ చర్చల తర్వాత సంస్థ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణంతోపాటు సంస్థ ఈక్విటీ వాటా రూ.2 వేల కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో రైలును టేకోవర్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకుండానే ప్రభుత్వం కార్యకలాపాలను నిర్వహించనుంది. కాగా, మెట్రో తీర్మానంపై సభలో చర్చించలేదని బీఆర్ఎస్ నేత‌ హరీష్ రావు అన్నారు. మెట్రో తీర్మాన ఆమోదం ఏకగ్రీవం కాదు.. ఏకపక్షం అంటూ మండిపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *