భారీ వ‌ర్షాల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూస్తున్నాం..

ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర : భారీ వర్షాలు, వరదల (Hyderabad Floods)తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలో జంట జలశయాల గేట్లు ఎత్తడం వల్ల మూసి పరివాహక ప్రాంతాల్లో ముంపుకు గురైన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. జీహెచ్‌హెచ్ తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఇప్పటి వరకు శంకర్ నగర్ ప్రాంతంలోని దాదాపు 500 మంది నిర్వాసితులు షాజాదీ మసీదులో వసతి పొందుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పునరావాసం లో వారికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మలక్‌పేట్ సర్కిల్‌లోని మూసా నగర్ కమ్యూనిటీ హాల్ లో 150 మంది వసతి పొందుతున్నారు. దుర్గా నగర్ , అంబేద్కర్ నగర్ నిర్వాసితులు దాదాపు 45 కుటుంబాలు మూసారాంబాగ్ వంతెనకు సమీపంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతి పొందుతున్నారు. దుర్గానగర్‌లోని 21 కుటుంబాలు భద్రత కోసం పై అంతస్తులకు మారాయి. గోల్నాక కమేలా సమీపంలోని కృష్ణ నగర్ నివాసితులైన 32 మందిని కృష్ణ నగర్ కమ్యూనిటీ హాల్‌కు తరలించారు. వారికి ఆహారపదార్థాలు అందిస్తున్నారు. భూ లక్ష్మీ ఆలయం నుండి 55 మందిని సురక్షిత ప్రదేశమైన గోడే-కి-ఖబర్ జిహెచ్‌ఎంసి కమ్యూనిటీ హాల్‌కు తరలించారు… పునరాగం కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారనీ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాత్రి ఒక్కసారిగా చాదర్ఘాట్ బ్రిడ్జి పై నుండి వరద పెరగడం, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో వరద ప్రవాహం పెరగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జీహెచ్ఎంసీ,పోలీస్, హైడ్రా, ట్రాఫిక్,వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ అన్ని రకాల చర్యలు తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఎంజీబీఎస్ నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్ రూట్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించినట్లు పేర్కొన్నారు. బతుకమ్మ ,దసరా పండుగ లకు వెళ్ళే ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు వరదవైపు ఎవరు రాకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మూసి పరివాహం వెంట ప్రధాన రహదారులపై భద్రత ను పెంచాలని నగర పోలీసులకు సూచించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *