హైదరాబాద్, జులై 17: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధికారులు గురువారం సీఐడీ అధిపతి చారుసిన్హాను కలిసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొంతమందిపై ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని వారు ఆరోపించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్ రావు గెలిచిన వెంటనే ‘నా విజయం కేటీఆర్, కవిత, హరీష్‌రావుకు అంకితం చేసినట్లు’ చెప్పారని ఆ ఫిర్యాదులో టీసీఏ తెలిపింది. ఇంకా మరికొందరు అక్రమార్కులు ఉన్నారని, వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌లపై కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. టీసీఏ అధ్యక్షుడు యండల లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి సీఐడీ చీఫ్‌ను కలిశారు. బీఆర్‌ఎస్ హయాంలో పెద్దల అండదండలతో జగన్‌మోహన్ రావు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రికెట్‌కు సంబంధం లేని రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ చేయాలని కోరారు.
ఐదుగురిపై మనీ లాండరింగ్ కేసు : ఈడీ చర్యలు
హెచ్‌సీఏలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులపై తాజాగా కేసు నమోదు చేసింది. ఈ కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అధ్యక్షురాలు కవిత యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ల కింద నమోదైంది. గతంలో హెచ్‌సీఏకు సంబంధించి నమోదైన రెండు కేసులను కలిపి ఈడీ కొత్త ఈసీఐఆర్‌ను రిజిస్టర్ చేసింది. బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు వచ్చిన నిధులలో భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఈడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులు తెలంగాణ సీఐడీ కస్టడీలో ఉన్నారు. సీఐడీ విచారణ పూర్తయిన వెంటనే ఈడీ వారిని తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.
కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు
హెచ్‌సీఏ అవకతవకలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఐదుగురు నిందితులను ఆరు రోజులపాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ మల్కాజిగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునిల్, రాజేందర్ యాదవ్, కవితలను సీఐడీ కస్టడీకి తీసుకోనుంది. గురువారం నుంచిఈనెల 22వరకు వారిని విచారించనున్నారు.



