– ప్రజలపై పన్నుల భారం పడడం ఖాయం
– ‘సమ్మిట్’ ఒప్పందాలపై అన్ని వివరాలు వెల్లడిరచాల్సిందే
– ‘నకిలీ’లతో ఒప్పందాలతో నట్టేట మునుగుతాం
– కుల గణనపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
– ప్రభుత్వ తీరుపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: నగర శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, కీలక గ్రామ పంచాయతీలను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ గతంలోనూ, ఇప్పటికీ స్పష్టంగా వ్యతిరేకిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విస్తరణ వెనుక రాజకీయ స్వలాభం, మజ్లిస్ పార్టీకి ప్రత్యేక ప్రయోజనం కల్పించేందుకే అన్న ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం దాదాపు 2,000 చ.కి.మీకు పెరిగి మొత్తం 300 వార్డులుగా పునర్విభజన జరుగుతుందని, ఇప్పటికే జీహెచ్‌ఎంసీలోని అనేక వార్డుల్లో రోడ్లు సరిగా లేవు.. సివరేజ్ సిస్టమ్ లేదు.. మౌలిక వసతులు సరిగా లేవన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా విస్తరణ పేరిట మరిన్ని ప్రాంతాలను చేర్చేలా ప్రభుత్వం జీవో జారీ చేయడం అన్యాయమని అన్నారు. ఇంతటితో ఆగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ల్యాండ్‌గా మార్చాలనుకోవడం మరో పెద్ద అన్యాయమని, దీనిపై తమ పార్టీ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు వినాలని, పబ్లిక్ డొమైన్‌లో పూర్తి వివరాలు ఉంచాలని డిమాండ్ చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ విస్తరణలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై రెట్టింపుమేర పన్నులు పెరుగుతాయని, ఇప్పటికే ఆ పల్లెల్లో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ వంటి అవసరమైన మౌలిక సౌకర్యాలు కూడా సరిగ్గా లేవని విమర్శించారు. హైదరాబాద్ ఒక గొప్ప నగరంగా ఎదగడం అనేది గర్వకారణంగా భావిస్తాం.. కానీ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా, ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించకుండా, పబ్లిక్ డొమైన్‌లో వివరాలు షేర్ చేయకపోవడం తప్పుడు పద్ధతి అని విమర్శించారు. విస్తరణను మూడు భాగాలుగా చేస్తూ ప్రత్యేకంగా మజ్లిస్ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వచ్చేలా లైనప్ చేస్తూ రాజకీయ ప్రయోజనం కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోందని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి డల్లాస్‌కు వెళ్లి పెట్టుబుడులు తీసుకొస్తామని చెప్పారు. పెట్టుబడులు రాలేదు కానీ ఇక్కడి ప్రజలను ఇబ్బందిపెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మున్సిపాలిటీల వరకు మొత్తం టాక్స్ స్ట్రక్చర్‌ను మారుస్తూ ప్రజలపై భారాన్ని భారీగా పెంచడం, పారదర్శకత లేకుండా నిర్ణయాలు తీసుకోవడం.. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని విమర్శించారు.
వారం రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి
కొత్తగా జీహెచ్‌ఎంసీలో చేర్చనున్న ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ వారం రోజుల్లో తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తప్పనిసరిగా సమర్పించాలని రామచందర్‌రావు కోరారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ విస్తరణ-సాధారణ విస్తరణ కాదు. ఇది ప్రత్యేకంగా మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చే కుట్ర. హైదరాబాద్ ప్రజలు ఈ కుట్రను తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మజ్లిస్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చే మాదిరిగానే నిర్ణయాలు తీసుకుందని, ఇప్పుడు అదే దారిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభల్లో మైబీ ముస్లిం అంటూ చేసిన వ్యాఖ్యల సంగతి అందరికీ తెలుసు. హైదరాబాద్‌ను మజ్లిస్ పార్టీ ఆధీనంలోకి నెట్టడం అన్యాయం. ఇది హిందూ-ముస్లిం సమస్య కాదు. ఇది పూర్తిగా అభివృద్ధి వర్సెస్ అవినీతి-లోపభూయిష్ట పాలన మధ్య జరిగే పోరాటం అని స్పష్టం చేశారు. అందుకే నగర ప్రజలందరూ అభివృద్ధిని అడ్డుకునే శక్తులకు వ్యతిరేకంగా నిలబడాలన్నారు.
ఒప్పందాలు చేసుకున్న కంపెనీల వివరాలు వెల్లడించాలి
మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిందని, ప్రకటించిన రూ.5.50 లక్షల కోట్ల పెట్టుబడులపై తీవ్రమైన సందేహాలున్నాయని, సర్కార్ వెల్లడిరచిన కంపెనీల జాబితా పరిశీలిస్తే చాలావాటికి దేశవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు లేదని తెలిపారు. కొన్ని గతంలోనే బ్లాక్‌లిస్ట్ అయినవి, మరికొన్ని తమకు ఉన్న మూలధనాన్ని కూడా సమర్థించుకోలేని స్థితిలో ఉన్నాయని వివరించారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య తప్ప మరొకటి కాదన్నారు. ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి.. వాటి విలువ ఎంత.. అవి నమ్మదగిన సంస్థలేనా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. ప్రచార కార్యక్రమాలు కాదు.. ప్రజలకు ప్రయోజనం చేకూరే నిజమైన అభివృద్ధి జరగాలన్నారు. మన విద్యార్థులకు, యువతకు ఉద్యోగాలు రావాలంటే నిజమైన కంపెనీలు, నమ్మదగిన పెట్టుబడులు అవసరమన్నారు. నకిలీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంట్తే హైదరాబాద్ ప్రపంచంలోనే పెద్ద మోసానికి గురైన నగరం అవుతుందన్నారు.
కుల గణనపై కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి
సీఎం రేవంత్ రెడ్డి కులగణన గురించి మాట్లాడటం చూస్తుంటే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బట్టబయలవుతోందన్నారు. స్వతంత్ర భారతంలో దాదాపు 60 సంవత్సరాలు కొనసాగిన కాంగ్రెస్ పాలనలో ఒక్కరోజు కూడా కులగణన గురించి కాంగ్రెస్ ఆలోచించలేదు. 1980లో మండల్ కమిషన్‌ను కూడా వ్యతిరేకించింది. సామాజిక న్యాయం, సమానత్వం, వెనుకబడిన వర్గాల డేటా గురించి నిజంగా శ్రద్ధ ఉంటే అపుడెందుకు వ్యతిరేకించారని ఆయన ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ కూడా సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి చివరికి దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు పంపి ఫైల్‌ను నిలిపేశారని, రూ.5,000 కోట్లు ఖర్చుతో చేసిన సర్వే రిపోర్టును ప్రజల ముందుంచలేదన్నారు. 2026 నుంచి దేశంలో కులగణన జరుగుతుంది అంటే అందుకు ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్ధి, సంకల్పం కారణమన్నారు. ఏ వర్గానికి పథకాలు నిజంగా చేరుతున్నాయి? ఇంకా ఎవరికి మద్దతు లభించాలి? ఎంతమంది వెనుకబడిన వర్గాలకు ఇంకా సహాయం అవసరమవుతోంది తెలుసుకోవడానికి, సమాజానికి నేరుగా ఉపయోగపడే, వాస్తవ పరిస్థితులు బయటపడే కులగణన ఇది అని రామచందర్‌రావు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ కులగణన సామాజిక-ఆర్థిక పురోగతి కోసం.. కానీ కాంగ్రెస్ కులగణన పూర్తిగా రాజకీయ లాభం కోసమేనన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతం రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




