– ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
– అందుబాటులో వివిధ భాషల పుస్తకాలు
– విద్యార్థులకు ఉచితం
– ప్రతిరోజూ వివిధ కార్యక్రమాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 38వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి)లో సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ‘పుస్తక స్ఫూర్తి’ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ పుస్తక ప్రదర్శన 19 నుండి 29, 2025 వరకు మొత్తం 11 రోజులపాటు నిర్వహిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9:00 గంటల వరకు, శని, ఆదివారాలు, సెలవు దినాల్లో మధ్యాహ్నం 12:00 గంటల నుండే ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది. విద్యార్థులకు (కేజీ నుంచి పీజీ వరకు) ఐడీ కార్డు చూపిస్తే ఉచిత ప్రవేశం. సాధారణ సందర్శకులకు ప్రవేశ రుసుము రూ. 10 వసూలు చేస్తారు. గత ఏడాది కంటే పెంచి, ఈసారి మొత్తం 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలకు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. మొత్తం ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ ప్రాంగణంగా నామకరణం చేశారు. ప్రధాన సాంస్కృతిక వేదికకు అనిశెట్టి రజిత వేదిక అని పేరు పెట్టారు. పుస్తకావిష్కరణల వేదికకు రచయిత కొంపల్లి వెంకట్‌గౌడ్ పేరు పెట్టారు. మీడియా పాయింట్‌కు దివంగత జర్నలిస్ట్ స్వేచ్ఛ పేరును ఖరారు చేశారు.
ప్రత్యేక కార్యక్రమాలు
ప్రదర్శనలో భాగంగా ప్రతిరోజూ వివిధ కొత్త పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయి. తెలంగాణ బాలోత్సవం పేరుతో పిల్లల కోసం ప్రత్యేకంగా మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం ‘పుస్తక స్ఫూర్తి’ పేరుతో రచయితలు, కవులతో చర్చా కార్యక్రమాలు ఉంటాయి. పుస్తక పఠనంపై అవగాహన కల్పించేందుకు ఒకరోజు ప్రత్యేకంగా ‘బుక్ వాక్’ నిర్వహించనున్నారు. స్కూల్/కాలేజ్ విద్యార్థులు ఐడీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. పుస్తకాలపై ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉంటాయి, కాబట్టి మీకు నచ్చిన పుస్తకాలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. పార్కింగ్ సౌకర్యం ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో ఏర్పాటు చేశారు. పుస్తకపఠనం పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రదర్శన ఇది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే