– మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం ఒక మెట్రో కాదు.. దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్. అభివృద్ధి, ప్రగతి, అవకాశాలు ఈ మూడు లక్షణాలు హైదరాబాద్ సొంతం.. అని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్- 2025ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గత పదేళ్లలో మహానగరం రియల్ ఎస్టేట్ రంగంలో దూకుడును నమోదు చేస్తోందని, ఒకప్పుడు సాధారణమైన ప్రాంతాలు ఇప్పుడు ప్రపంచ మ్యాప్‌పై పెట్టుబడిదారులను ఆకర్షించే గమ్యస్థానాలుగా మారాయని తెలిపారు. దేశంలో ఏ నగరానికీ లేని వేగం భాగ్యనగరం సొంతం అన్నారు. విజన్, వైభవం అన్నీ మన మహానగరం ప్రత్యేకతలని, ఏవైపు చూసినా ప్రపంచ దేశాలను తలదన్నేలా నిర్మాణాలు ఇప్పుడు హైదరాబాద్ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చెందేలా చేస్తున్నాయని చెప్పారు. మిలమిల మెరిసిపోతున్న భవనాలు, మౌలిక వసతులు నగరం రూపురేఖలను మార్చేస్తున్నాయంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఐటీ, మెట్రో, ఇండస్ట్రియల్ కారిడార్.. ఇలా ప్రతీ రంగంలో హైదరాబాద్ సత్తా చాటుతోందన్నారు. నగరానికి రియల్ ఎస్టేట్ రంగం ఆక్సిజన్‌లా మారిందని, సెంటర్ ఆఫ్ గ్రావిటీగా నిలుస్తోందని, అందుకే అంతర్జాతీయ కంపెనీలు కూడా హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయని చెప్పారు. ఇక్కడ ప్రతి అంగుళం భూమి విలువ అంతకంతకూ పెరుగుతోందన్నారు. అభివృద్ధి మార్గంలో చిక్కుముడులు సహజమని, ముందుకు సాగాలంటే అవరోధాలు తప్పవని, వాటిని అధిగమించే ధైర్యం ఉండాలని, అప్పుడే నిజమైన విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న రోజుల నుంచి, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తరువాత కూడా హైదరాబాద్ అసెట్ క్యాపిటల్‌గా, ఆశల సౌధంగా నిలుస్తోంది. కట్టుబట్టలతో నగరానికి వచ్చినవారు ఇప్పుడు వేల కోట్లకు అధిపతులయ్యారు. ఔత్సాహికులకు, పారిశ్రామికవేత్తలకు ఈ నగరం స్వర్గధామం. హైదరాబాద్ ప్రతి మూల అభివృద్ధి నమూనాను సాక్షాత్కరింపజేస్తున్నాయి. దేశంలో అన్ని వైపులా అభివృద్ధి పరవళ్ళు తొక్కుతున్న నగరం హైదరాబాద్! రియల్ ఎస్టేట్ రంగం విస్తరించిండంతో సిటీ రూపు రేఖలు మారిపోతున్నాయ్. రాష్ట్రం ఏర్పడిన నుంచి దేశంలోనే మేటి మెట్రో నగరంగా ఎదుగుతోంది. ఆ అభివృద్ధి ఒరవడి నేటికీ అదే వేగంతో కొనసాగుతోంది. ఇక్కడ అవకాశాలు పుష్కలం. వాటన్నింటి గురించిన అవగాహన కొందరికి మాత్రమే ఉంది. తెలిసిన వాళ్లకి కూడా కొన్ని విషయాలే తెలుసు. ఇంకా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయ్. ఇలాంటి సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోని మార్పులు, అవకాశాలు, దిశా నిర్దేశం అందరికీ చేరేలా చేయాలనే సంకల్పంతో రాజ్ న్యూస్ ముందుకొచ్చిందన్నారు. రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి దన్నుగా నిలవాలని ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారని, గతంలో కూడా లక్ష్మీరావు రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు దిశా నిర్దేశం జరగాలని, ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలు అన్ని వర్గాలకు చేరాలని ఆమె సంకల్పించారన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నదే ఆమె ఉద్దేశం. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ కట్టడాలు కాదు. ప్రభుత్వం-ప్రైవేట్ రంగాలు చేతులు కలిపినపుడే ఆ అభివృద్ధి ఫలాలు సామాన్యుడి తలుపు తడతాయి. ఇదే సంకల్పంతో రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించారు. నారెడ్‌కో తెలంగాణ, హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్(హెచ్‌ఆర్‌ఏ) మద్దతుతో రాజ్ న్యూస్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ – 2025 సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా డెవలపర్లు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, మేధావులు, దార్శనికుల ఆలోచనలు ఒక వేదికపైకి తెస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఓ వైపు ఇండస్ట్రీ దార్శనికులు మరో వైపు.. అందరి లక్ష్యం ఒకటే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్‌ను దేదీప్యమానం చేయడమే. దేశానికి దిశా నిర్దేశం చేస్తున్న హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ మరింత జీవాన్నిఅందించేలా చేయడమే సమ్మిట్ లక్ష్యం. హైదరాబాద్ నగరం గురించి చెప్పుకోవాలంటే నేడు, రేపు మాత్రమే. గతమన్నది ఇక గతం మాత్రమేనని మంత్రి ఉత్తవమ్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





