హీలింగ్ కేపిటల్‌గా హైదరాబాద్

– డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో ‘హెల్త్ కేర్‌’ అనుసంధానం
– సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేస్తేనే సమాజానికి మేలు
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ కేపిటల్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్‌ను డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో అనుసంధానించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. లండన్ కేంద్రంగా పనిచేసే PHUSE ఆధ్వర్యంలో PHUSE APAC Connect  2026 పేరిట హెచఐసీసీలో నిర్వహించిన సదస్సులో క్లినికల్ రీసెర్చ్, డేటా సైన్స్ అనుసంధానంపై దేశ, విదేశాల నిపుణులు మేధోమథనం చేశారు. శనివారంనాటి ముగింపు కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెల్త్ కేర్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో క్లినికల్ సైన్స్, ఏఐ, రియల్ వరల్డ్ ఎవిడెన్స్ మేళవింపుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ముఖ్యంగా క్లినికల్ రీసెర్చ్‌లో విప్లవాత్మక మార్పులొస్తాయని, టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుందని మంత్రి తెలిపారు. ఇలాంటి తరుణంలో అందుకు అవసరమైన ఎకో సిస్టంను ఇప్పటినుంచే తెలంగాణలో అభివృద్ధి చేసేలా దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఏఐ సిటీ, యంగ్ ఇండియన్ స్కిల్స్ వర్సిటీ, జీనోమ్ వ్యాలీ విస్తరణ, డేటా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైలింగ్, మెడికల్ టూరిజం పాలసీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్ కు శ్రీకారం చుట్టామన్నారు. సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరుగుతుందన్నారు. అందుకోసం పరిశోధకులు, వైద్యులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరముందన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పరిశోధకులను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో PHUSE బోర్డు ఛైర్మన్ స్టీఫెన్ బాఫోర్డ్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సర్వేష్ సింగ్, ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *