ఆవిష్కరణలు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఫార్మా, డిఫెన్స్, ఏవియేషన్ పరిశ్రమలకు కూడా నగరం కీలక వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలకు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని చెప్పారు. బ్రిక్స్ దేశాల్లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులకు అనువైన వాతావరణం, ఆధునిక సాంకేతికతల ప్రభావంపై అధ్యయనం చేయడానికి విచ్చేసిన జర్మన్ ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును కలిసింది. గ్లోబల్ బ్రిడ్జెస్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణలో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి వారితో చర్చించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులÅ£నుగుణంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న విధానాలను అమలు చేయడంలో ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని చెప్పారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా, నీటి లభ్యతలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేకుండా మెరుగైన పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తూ పరిశ్రమలకు స్థిరత్వాన్ని కల్పిస్తున్నామని వివరించారు. భౌగోళికంగా భారత దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ ఏడాది పొడవునా ఆహ్లాదకర వాతావరణం, విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో కూడిన కాస్మోపాలిటన్ జీవనశైలితో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారికి సొంత ఊరు అనే భావన కలిగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. నగరం దక్షిణ భాగంలో ప్రతిష్ఠాత్మక ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు వేగంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగా ఏర్పాటవుతున్న ఏఐ సిటీ, నెట్ జీరో సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని అన్నారు. తెలంగాణలో అపారమైన మానవ వనరులు, టాలెంట్ పూల్ అందుబాటులో ఉండటంతో పరిశ్రమలకు నిపుణుల కొరత తలెత్తే సమస్యే ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వృత్తి నిపుణులతోపాటు కొత్తగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతను ప్రపంచస్థాయి సవాళ్లకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. సెమీ కండక్టర్ రంగం తెలంగాణలో వేగంగా విస్తరిస్తోందని, చిప్స్ డిజైన్, తయారీ రంగాల్లో తైవాన్, కొరియా సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని వివరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. జర్మనీ సాంకేతికత తోడైతే ఇంజనీరింగ్ రంగంలో తెలంగాణ మరింత ముందుకు దూసుకెళ్తుందని శ్రీధర్ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. సమావేశంలో జర్మన్ ప్రతినిధి బృందం సభ్యులు డాక్టర్ స్టెఫాన్ ట్రేగర్, డాక్టర్ క్రిస్టియన్ అల్టెన్ హోఫెన్, ఫ్రాంక్ బీర్ హోస్ట్, అలెగ్జాండర్ వాన్ క్రామ్, మాల్టె హొహ్ ఫీల్డ్, ఫిలిప్ మేయర్ హోఫర్, మ్యాక్స్ మిల్లన్ వ్యాన్ లెయర్ తదిరులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి కూడా పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *