ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ
సభకు ప్రజలు భారీగా తరలి రావాలి
నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, ప్రజాతంత్ర, మార్చి 28 : ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ లో నిర్వహించ తలపెట్టిన సభ చరిత్రలో నిలిచిపోతుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ అనేది దేశ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణి ప్రారంభోత్సవ కార్యక్రమం హుజుర్ నగర్ కేంద్రంగా జరగడం ఇక్కడి ప్రజల అదృష్టం గా భావిస్తునన్నారు. ఈనెల 30న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రాంగణం వేదికగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యవేక్షించారు. మంత్రి ఉత్తమ్ వెంట ఐజి.సత్యనారాయణ, కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సభ ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభించుకోవడం ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించబోతుందన్నారు. అటువంటి కీలక ఘట్టంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రాష్ట్ర జనాభాలో 84 శాతానికి అందించబోతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
అర్హతను బట్టి రేషన్ కార్డుల మంజూరు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టం అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను బట్టి ఇస్తున్నామని చెప్పారు. కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్ట్ లో ఉంటే సన్న బియ్యం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇస్తున్నాం.. తెలంగాణ ఏర్పాటు నాటికి 89 లక్షల 73వేల 708 కార్డులు ఉండేది. గత పదేళ్లలో 49వేల 479 కొత్త కార్డులు ఇచ్చారు. ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు… 2.85 కోట్ల లబ్దిదారులు ఉన్నారు. 10,665 కోట్ల నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నాయి. త్వరలోనే బియ్యంతో పాటు పప్పు, ఉప్పు లాంటి వస్తువులు ఇస్తాం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.





