– సన్న బియ్యానికి మించిన సంక్షేమం మరోటి లేదు
– రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ
– బీఆర్‌ఎస్ పాలనలో రేషన్ కార్డుల మంజూరే లేదు
– కార్యకర్తలే పార్టీకి, ప్రభుత్వానికి మూలస్తంభాలు
– ఎత్తిపోతలతో హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాలు సస్యశ్యామలం
-మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జులై 29: నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీని మించిన సంక్షేమం మరోటి ఉండబోదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని హుజూర్‌నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభించుకోవడం ఆనందదాయకమన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలసి లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కోటాను కోట్లు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం పంపిణీ చేసినా ప్రజలు వినియోగించుకునేందుకు అయిష్టత చూపడంతో అవి పక్కదోవ పట్టాయన్నారు. ప్రజాభీష్టానికనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రివర్గ సమష్టి నిర్ణయంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. సన్న బియ్యాన్ని ఉచితంగా పేదలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలను నిర్లక్ష్యం చేశారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో 7 లక్షల 95 వేల 685 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. తద్వారా కొత్తగా 33 లక్షల 97 వేల 367 మందికి లబ్ది చేకూరిందని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి 89 లక్షల కార్డులతో 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 3 కోట్ల 78 లక్షల 367 మందికి చేరిందన్నారు. ప్రభుత్వంపై భారం పడినా ఖాతరు చేయకుండా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి నిరుపేద కడుపు నింపేందుకే ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని మంత్రి ఉత్తమ్ కోరారు.
ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా మారిందన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే ఈ నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఇచ్చి సరికొత్త రికార్డు నమోదు చేసుకుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కార్యకర్తలే మూలస్తంభాలన్నారు. ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. 18 ఏళ్ల తరువాత జులైలోనే నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేశామన్నారు. సాగర్ ఆయకట్టు రైతాంగం ఆశీర్వాదాలతోటే తాను ఆరుసార్లు శాసనసభకు, ఒకమారు లోకసభకు ఎన్నికయ్యానని చెప్పారు. రైతాంగం ఆశీర్వాదాలతో నీటిపారుదల శాఖ మంత్రిగా సాగర్ నీటిని విడుదల చేయడం తన అదృష్టమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





