హౌసింగ్ కాలనీ నా మానస పుత్రిక

– సీఎం చేతుల మీదుగా మార్చిలో ప్రారంభోత్సవం
– మొదటి దశలో వెయ్యిమంది ఎంపిక
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: తాను ఎంతో మనసు పెట్టి మనస్ఫూర్తిగా 2011లో హుజుర్‌నగర్‌లో ప్రారంభించిన హౌసింగ్ కాలనీని మార్చిలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రూ.125 కోట్లతో 111 ఎకరాల విస్తీర్ణంలో 2,160 కుటుంబాలకు నివాస యోగ్యం కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన మానస పుత్రికగా భావించి చరిత్రలోనే రోల్ మోడల్‌గా నిలిచిపోయేలా ఇక్కడ హోసింగ్ కాలనీని ఉత్తమ్ కుమార్ నిర్మాణం చేపట్టారు. అర్హులైన నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలన్న మానవీయ కోణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూములను కొనుగోలు చేసి అతిపెద్ద గృహ సముదాయాల నిర్మాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కాలక్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ పనులు అటకెక్కాయి. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుండి అధికార యంత్రాంగాన్ని ఉరుకులుపరుగులు పెట్టించి సరిపడ నిధులు విడుదల చేయించి మౌలిక సదుపాయాలతో పూర్తి చేయించారు. ఈ క్రమంలో మంత్రి ఈ కాలనీని మంగ‌ళ‌వారం సందర్శించి నిర్మాణ పనుల పురోగతి సమీక్షించారు. గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ మానసపుత్రికగా చేప‌ట్టి రోల్ మోడల్ హౌసింగ్ కాలనీగా రూపొందించామని, అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి ముగింపు దశకు చేరుకుందని, అయినా నాటి పాలకులు నిర్లక్ష్యం చేయడమే కాక చెత్త కుప్పగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మీదట పెరుగుతున్న ధరలకనుగుణంగా నిధులు మంజూరు చేయించి అన్ని మౌలిక సదుపాయాలతో పూర్తిచేసినట్టు తెలిపారు. అర్హులైన నిరుపేదలకు గృహ వసతి కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగానే లబ్దిదారుల ఎంపిక ఉంటుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. మొదటి దశలో వెయ్యి మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *