మానవత్వమే గొప్ప కానుక

– బొకేలు వద్దు.. బ్లాంకెట్లు ఇవ్వండి
– చలి నుంచి పేదలను రక్షించవచ్చు
– మంత్రి సీతక్క పిలుపు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 1:సెర్ప్ విభాగం ద్వారా రాష్ట్రంలో పేద‌రిక‌ నిర్మూలన కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తెలిపారు. నూతన సంవత్సరాన్ని ఆర్భాటాలతో కాకుండా మానవత్వంతో ప్రారంభించాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆధ్వర్యంలో సెర్ప్‌ డైరెక్టర్లు, సిబ్బంది మంత్రి సీతక్కను గురువారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూల బొకే కాకుండా తెలంగాణ నేతన్నలు తయారు చేసిన దుప్పటిని మంత్రి సీతక్కకు దివ్య దేవరాజన్ బ‌హూక‌రించారు. డైరెక్టర్లు, సిబ్బందిని మంత్రి సీతక్క అభినందించారు. అనంతరం ఆమె రాష్ట్ర ప్రజలందరికీ, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం నుంచి బొకేలు కాకుండా శాలువాలు, దుప్పట్లు ఇవ్వాలని సూచించారు. అలా అందే దుప్పట్లు పేద విద్యార్థులు, చలితో వణికే పిల్లలకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయగా ఆయన కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారని వెల్లడించారు. చలి కాలంలో నిరాశ్రయులు, వృద్ధులు, కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తుచేస్తూ బొకేలు క్షణాల్లో వాడుక లేకుండా పోతే ఒక దుప్పటి పేదవాడికి రక్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. శాలువాలు, దుప్పట్లు సులభంగా లభించేలా టెస్కో ద్వారా సెక్రటేరియట్ ముందు ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పేదల చిరునవ్వే నిజమైన నూతన సంవత్సర శుభాకాంక్ష అని, చిన్న సహాయం కూడా పెద్ద మార్పుకు దారి తీస్తుందని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *