మానవతా దృక్పథం అవసరం

– గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు క‌ల్పించాలి
– వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ సంకల్పం
– అధికారులకు మంత్రి అడ్లూరి దిశానిర్దేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని, ప్రభుత్వ ఆలోచనకనుగుణంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, అటవీ శాఖ అధికారులు, గిరిజన ప్రాంతాల ప్రజాప్రతినిధులతో ఆయన మంత్రి అడ్లురి విస్తృతంగా చర్చించారు. పేద గిరిజనులు నివసించే ప్రతీ ప్రాంతానికి చేరుకునేందుకు రోడ్డు, నివసించేందుకు గూడు, అడవుల్లో చీకట్లు తొలగించేందుకు విద్యుత్, తాగునీటి కోసం బోర్లు వంటి ప్రాథమిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ మౌలిక సదుపాయాలే గిరిజనుల జీవన ప్రమాణాల పెరుగుదలకు పునాది అని పేర్కొన్నారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ అమలు దశలో ఎదురవుతున్న అడ్డంకులపై మంత్రి చర్చించారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలంటే శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కేటాయించిన నిధులు క్షేత్రస్థాయికి చేరేలా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. నిధులున్నా పనులు జరగకపోవడాన్ని సహించబోమని హెచ్చరించారు. అటవీ భూములు, పోడు సాగు, అటవీ హక్కుల చట్టం కింద హక్కుల పత్రాల జారీ విషయంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. అడవిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు  వ్యవసాయం ఒక్కటే ఆధారం కాబట్టి అటవీ చట్టాన్ని అనుసరించి వారికి వ్యవసాయం చేసుకునేలా ఎక్కడ వీలైతే అక్కడ సాగు భూమిని అందుబాటులో ఉండేలా చూడాలని అటవీశాఖ అధికారులను అడ్లూరి ఆదేశించారు. హైకోర్టు అడ్వకేట్ జనరల్‌తో సంప్రదించి గిరిజన యువతకు ఎస్టీ సర్టిఫికెట్ వ్యవహారంలో శాశ్వత పరిష్కారం చూడాలని కూడా ఆదేశించారు. ధ్రువీకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరళమైన విధానాన్ని అమలు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, అటవీ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ప్రతి జిల్లాలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి సమస్యలను స్థానికంగానే పరిష్కరించే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇసుక రవాణా సమస్యలు అడ్డంకి కాకూడదని, అవసరమైనచోట ప్రత్యేక అనుమతులు ఇచ్చి నిర్మాణాల్ని వేగవంతం చేయాలని సూచించారు. తాగునీటి సమస్య నివారణకు కొత్త బోర్లు వేయడం, పాత వనరులను పునరుద్ధరించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించారు. గిరిజన గ్రామాలను స్వయంగా సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటానని తెలిపారు. ఈ నెలాఖరులోగా గిరిజన ప్రాంతాల్లో ముఖ్య సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు ప్రారంభించాలని మంత్రి గడువు విధించారు. ఒక ప్రాంత సమస్యను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేయకుండా స్థానిక పరిస్థితులకనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గిరిజన సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించినందుకు మంత్రిని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభినందించారు. సమావేశంలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సబ్యసాచి ఘోష్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ, ఎమ్మెల్యేలు బాలు నాయక్, రామచంద్ర నాయక్, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మురళినాయక్, కోవ లక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, డీఎఫ్‌వోలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *