– న్యాయం కోసం ఫిర్యాదుల వెల్లువ
– పది రోజుల్లో వేయి ఫిర్యాదులు
– రోజుకు సగటున వందమందితో వర్చువల్‌గా సంభాషణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: సైబర్ నేరాల బాధితులకు భరోసా కల్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఫిర్యాదు చేసేలా రూపొందించిన వినూత్న కార్యక్రమమే ’సీ`మిత్ర’. ఈ కార్యక్రమం ఈనెల 9వ తేదీన అధికారికంగా ప్రారంభమైంది. ఇది అమల్లోకి వచ్చిన మొదటి పది రోజుల్లోనే దాదాపు వెయ్యిమంది సైబర్ బాధితులకు ఫోన్ కాల్స్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. రోజుకు సగటున వందమంది బాధితులతో వర్చువల్‌గా సంభాషిస్తున్నామని పేర్కొన్నారు. సీ`మిత్రలో ప్రత్యేకంగా నియమించిన వర్చువల్ పోలీస్ బృందం సైబర్ బాధితులతో నేరుగా మాట్లాడుతున్నదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. నేరం ఎలా జరిగిందో తెలుసుకోవడం, అవసరమైన వివరాలు సేకరించడం, ఫిర్యాదు ఎలా చేయాలో మార్గనిర్దేశర చేయడం వంటి సేవలు అందిస్తున్నామన్నారు. దీంతో బాధితుల్లో భయం తగ్గి పోలీసులపై నమ్మకం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. సీ`మిత్ర కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇప్పటికే 200కి పైగా ఫిర్యాదు డ్రాప్ట్‌లు సిద్ధం చేశామని పోలీసులు వెల్లడించారు. బాధితుల సమాచారం ఆధారంగా ఆటోమేటిక్‌గా కంప్లైంట్ ముసాయిదా తయారు చేసినట్లు తెలిపారు. ఈ డ్రాప్ట్‌లు బాధితులకు పంపి వారు సంతకం చేసిన తర్వాత తదుపరి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు వందకి పైగా ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరాలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామంటూ ఇది సీ`మిత్ర కార్యక్రమం విజయానికి నిదర్శనంగా అధికారులు పేర్కొంటున్నారు.
సీ`మిత్రలో మరో కీలక అంశం ఏమిటంటే బాధితులు 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేస్తే వెంటనే సీ`మిత్ర బృందం స్పందిస్తోంది. ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత దాని కాపీని నేరుగా బాధితుల మొబైల్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. దీంతో పారదర్శకత పెరిగి బాధితులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటున్నది. డిజిటల్ సదుపాయాలు లేని బాధితుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో సంతకం చేసిన ఫిర్యాదు పత్రాలను పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపే వెసులుబాటు కల్పించారు. సీ`మిత్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు 24 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రెండు షిప్ట్‌ల్లో సేవలు అందిస్తున్నారు. బాధితుల కోసం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు వర్చువల్ హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటోంది. ఈ సమయంలో సైబర్ నేరాలకు సంబంధించిన అన్ని సందేహాలకు సీ`మిత్ర బృందం సమాధానాలు ఇస్తోంది. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి భయపడే వారు చాలామంది ఉంటారు. అయితే సీ`మిత్ర ద్వారా బాధితుల్లో భరోసా, పోలీసులపై నమ్మకం, ఫిర్యాదు చేయాలనే ధైర్యం పెరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





