– తిరుగువారం రోజున కొనసాగిన రద్దీ
మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: సమ్మక్క సారలమ్మ జాతర తిరుగువారం సందర్భంగా వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహంతో బుధవారం కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొదటగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వన దేవతలకు బంగారం, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర పరిసర ప్రాంతాలలోని వ్యర్ధాలను పారిశుధ్య కార్మికుల ద్వారా తొలగిస్తూ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుగువారం సందర్భంగా వన దేవతల పూజారులు కన్నెపల్లి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి వన దేవతలకు దీపధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్ల పూజ సామగ్రి, పట్టు వస్త్రాలను పూజారులు భద్రపరిచారు.
5 లక్షల మందికిపైగా మొక్కులు : మంత్రి సీతక్క
ములుగు: తిరుగువారం సందర్భంగా సుమారుగా 5 లక్షల మందికి పైగా భక్తులు రావడం జరిగింది అని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం సీతక్క విలేకరులతో మాట్లాడారు. తాగునీరు, శానిటేషన్, రవాణా విషయంలో ఎటువంటి లోపం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మేడారం మహా జాతరకు రెండు కోట్ల మందికి పైగా భక్తులు వచ్చారని, ఇంకా వారం రోజులపాటు వస్తారని తెలిపారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నదన్నారు. కానీ కొంతమంది దద్దమ్మలు కావాలని జాతరను తప్పుదోవపట్టించాలని చిల్లర వేషాలు వేశారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. జంపన్న వాగులో ఒకరు అనుకోకుండా నీటిలో మునిగి చనిపోవడం జరిగిందని అంతే తప్ప ఎలాంటి సంఘటనలు జరగలేదని మం త్రి సీతక్క అన్నారు. మేడారం మహా జాతరలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని వెదవలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారికి కొంచమైనా సిగ్గుండాలని సీతక్క అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





