తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి

– హడ్కో చైర్మన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి 
– భారత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని ఆహ్వానం
– ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై చర్చ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ‘హడ్కో’ చైర్మన్‌ సంజయ్‌ కులశ్రేష్ఠను కోరారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎంతో సంజయ్‌ కులశ్రేష్ఠ సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్‌, రేడియల్‌ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారులు, బందరు పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి, బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణాలపై వారి మధ్య చర్చ జరిగింది. గతంలో అత్యధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలకు సంబంధించి రుణ పునర్వ్యవ్యస్థీకరణ (లోన్‌ రీకన్‌స్ట్రక్చన్‌) అంశాన్ని సీఎం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై హడ్కో చైర్మన్‌ సానుకూలంగా స్పందించారు. సానుకూల వృద్ది రేటుతో ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘ కాల రుణాలు ఇవ్వాలని సీఎం కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని హడ్కో చైర్మన్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి తెలియజేశారు. మరో పది లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు వేగంగా మంజూరు చేయాలని సీఎం కోరగా చైర్మన్‌ కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని హడ్కో ఛైర్మన్‌ను సీఎం ఆహ్వానించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్‌, హడ్కో రీజినల్‌ చీఫ్‌ పి.సుభాష్‌ రెడ్డి, హడ్కో జాయింట్‌ జనరల్‌ మేనేజర్లు ఆశీష్‌ గుండాల, సయ్యద్‌ రహీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *