– 99 రోజుల ప్రణాళికలో 2764 మందికి ప్రయోజనం
– 1200మంది ఎల్-3 కేటగిరీ లబ్దిదారులకు ఊరట
– హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వారం రోజుల్లో 2,764మంది లబ్దిదారులకు సంబంధించి సుమారు రూ.28.50 కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతి విభాగంలోనూ చేపట్టాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 99 రోజుల కార్యక్రమంలో వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతున్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ఫష్టంగా నిర్దేశించారు. దీంతో 99 రోజుల కార్యక్రమం మొదటి వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇండ్ల నిర్మాణ పురోగతిని అనుససరించి విడతల వారీగా బిల్లులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లబ్ధిదారుల ఆధార్ నెంబరును బ్యాంక్ అకౌంట్‌లకు నుసంధానించకపోవడం, వారి పేర్లలో తేడాలు ఉండటం, ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేసిన పొటోలు సరిగా లేకపోవడం, ఏఐ పరిశీలనలో అభ్యంతరాలు రావడంతోపాటు, గత పథకాల్లో లబ్ది పొంది ఉండటం, ఎల్-3 కేటగిరి నుంచి ఎల్-1 కేటగిరీ జాబితాల్లోకి వచ్చిన వారి వివరాల పరిశీలన, ఇలా పలు కారణాలతో బిల్లుల విడుదలలో ఆలస్యం అనివార్యమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాలన-ప్రగతి ప్రణాళికలో మొదటి వారం రోజులపాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని గౌతం తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రత్యేక దృష్టి సారించి నిశితంగా పరిశీలించి క్లియర్ చేశామని వివరించారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత వారం రోజుల్లో క్లియర్ చేసిన బిల్లుల్లో ఎల్-3 జాబితాలో ఉన్న 1,200 మందికి సంబంధించి రూ.12.06 కోట్ల విడుదల, బిల్లులు విడుదలైనప్పటికీ వివిధ కారణాలతో బ్యాంక్ వద్ద పేమెంట్ ఫెయిల్ అయిన 653 మందికి చెందిన రూ.7 కోట్ల మేర మొత్తాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. వీటితోపాటు పలు అభ్యంతరాలు, నిశిత పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉన్న మరో 911 మంది లబ్ధిదారులకు రూ.9.40 కోట్లను కూడా విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్యాంకుల ద్వారా చెల్లింపుల విషయంలో భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలంటే లబ్దిదారులు బ్యాంకులకు వెళ్లి తమ ఆధార్ అనుసంధానం, పేర్లు తదితర వివరాలను సరిచూసుకోవాలని ఎండీ విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





