మహోన్నత ఆశయంతో ఇళ్ల నిర్మాణం

– మానవీయ కోణంతో చేపట్టిన భారీ సంక్షేమ పథకం
– సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయ కోణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల భారీ సంక్షేమ పథకాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి సిమెంటు, స్టీలు పరిశ్రమల యజమానులు, అధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటికే వేగంగా ఇళ్ల నిర్మాణం చేస్తోందని తెలిపారు. స్టీలు, సిమెంటు పరిశ్రమలను ఎంతగానో ప్రోత్సహించామని, మానవీయ కోణంలో ఆలోచించి ఇందిర ఇళ్ల నిర్మాణానికి స్టీలు, సిమెంటు ధరలు తగ్గించి, భారీ భవంతుల నిర్మాణానికి ఏ విధమైన నాణ్యతతో సరఫరా చేస్తారో ఇందిరమ్మ ఇళ్లకు కూడా అలాగే సరఫరా చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఇంత పెద్ద‌ సంక్షేమ పథకం అమలు జరగుతోందని, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై చేయూతనివ్వాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. పెద్ద, చిన్న తేడా లేకుండా కంపెనీలన్నీ ఒకే ధరకు సిమెంటు, స్టీలు సరఫరా చేయాలని సూచించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరిశ్రమలు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని, భవిష్యత్తులో రాష్ట్రంలో సిమెంటు, స్టీలు ఉత్పత్తులకు భారీ డిమాండ్‌ ఏర్పడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సిమెంటు, స్టీలు పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకు నాణ్యతతో కూడిన సిమెంటు, స్టీలును సరఫరా చేయాలని శ్రీధర్‌ బాబు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు సిమెంటు కంపెనీలు అందిస్తున్న ధరను సమావేశంలో మంత్రులు సమీక్షించారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల సిమెంటు, 27.75 లక్షల మెట్రిక్‌ టన్నుల స్టీలు అవసరం అవుతుందని అధికారులు పరిశ్రమల యజమానులు, నిర్వాహకులకు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రోత్సహమందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని సిమెంటు, స్టీలు కంపెనీల యజమానులు, ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వీలైనంత త్వరలో యాజమాన్యాలు, ప్రతినిధులు సమావేశమై ధరలు నిర్ణయిస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


#cemen#Cement, steel #rea

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *