– పేదల కోసం సుప్రీం కోర్టుకైనా వెళ్లి కొట్లాడతాం
– మా ప్రభుత్వంలో ఇళ్లు కట్టిస్తాం.. కేసీఆర్ మాట ఇచ్చారు
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– ఖమ్మం భూదాన్ భూముల బాధితులకు భరోసా
ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ‘దలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సింది పోయి ఉన్న ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. పరీక్షల సమయంలో విద్యార్థులను రోడ్డున పడేయడం దారుణం.. తమ ప్రభుత్వం వచ్చాక ఇదే స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ చెప్పమన్నారు అని ఆయన బాధితుల్లో భరోసా నింపారు. ముగ్గురు రియల్ ఎస్టేట్స్ వ్యాపారాల కోసమే భూదాన భూముల్లో ఇళ్ల తొలగింపు జరిగిందన్నారు. ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను కేటీఆర్ గురువారం పరామర్శించారు. బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్న ఆయన వారికి బి ఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మీ కోసం పోరాడేందుకు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం.. వాటి ఖర్చులను మేమే భరిస్తాం.. శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం అని స్పష్టం చేశారు. బాధితులను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతాయని, అందరూ ఐకమత్యంతో పోరాడాలన్నారు. మీ దగ్గర స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు చట్టబద్ధంగా ఉన్నాయన్నారు. ఇవి కచ్చితంగా సక్రమమే అన్నారు. శత్రుదేశం మీద దండ యాత్రకి పోయినట్లు 4000 మంది పోలీసులతో మీ మీద నిర్బంధం ప్రయోగించి ఇళ్ళు తొలగించారన్నారు. నేను మిమ్మల్ని పరామర్శించి అండగా ఉండడానికి వస్తుంటే పోలీసులను పెట్టి నన్ను ఆపే ప్రయత్నం చేశారు. వీళ్ళు తప్పు చేయపోతే ముగ్గురు మంత్రులు వున్నా ఒక్క మంత్రి కూడా మీ వద్దకు వచ్చి ఎందుకు సమాధానం చెప్పలేదన్నారు. మూడు రోజులుగా ఆక్రమణల తొలగింపు విధుల్లో ఉన్న ఖమ్మం ఆర్డిఓ నరసింహారావు ను రాత్రికి రాత్రి ట్రాన్సఫర్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని ముగ్గురు మంత్రుల అవినీతి దాహానికి సామాన్య ప్రజల రోడ్డున పడేశారన్నారు. భార్య పుస్తెల తాడు అమ్మి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తే ఆ కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలి?, 12 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని నేడు నిర్దాక్షిణ్యంగా బజారున పడేశారని కేటీఆర్ మండిపడ్డారు. బాధితుల భూములు సక్రమమేనని, కానీ సదరు మంత్రుల బుద్ధే అక్రమమని విమర్శించారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేదల ఇండ్లు కూలగొట్టిందని మండిపడ్డారు. ఇక్కడి సమస్యపై ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్ లో పునరావాసం పొందుతున్న బాధితులను కేటీఆర్ పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్య సభ సభ్యుడు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కాంతారావు, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




