– హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గౌతం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల విడుదలకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా 4,473 మందికి రూ.48.79 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ప్రతి వారం ఇండ్ల నిర్మాణ దశలనుబట్టి లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారానికి సంబంధించి రూఫ్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తి చేసిన 1,969 మంది లబ్ధిదారులకు రూ.17.23 కోట్లు, స్లాబు పూర్తి చేసిన 2,504 మందికి రూ.31.56 కోట్లు విడుదల చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లక్ష ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశలో ఫలితాలు సాధిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇంతవరకు రూ.5376.22 కోట్లు విడుదల
ఈ పథకంలో భాగంగా ఇంతవరకు లబ్ధిదారులకు రూ.5376.22 కోట్లను విడుదల చేసినట్లు ఎండి గౌతం వివరించారు. ఇంటి నిర్మాణపు పురోగతినిబట్టి విడతల వారీగా లబ్ధిదారులకు రూ.5 లక్షలను అందజేస్తున్నారు. ఇంతవరకు బేస్ మెంట్ నిర్మాణం పూర్తి అయిన వాటికి రూ.2,125.98 కోట్లు, గోడలు పూర్తి అయి రూఫ్ లెవల్ వరకు వచ్చిన ఇండ్లకు రూ.1518.51 కోట్లు, స్లాబ్ పూర్తి అయిన వాటికి రూ.1731.73 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్ల పనులు ప్రారంభంగా కాగా వాటిలో ఇంతవరకు 1,13,365 ఇండ్ల స్లాబు పూర్తి అయ్యిందని, 34,552 ఇండ్లు రూఫ్ లెవల్ (గోడల నిర్మాణం పూర్తి) దశలో ఉన్నాయని, మరో 61 వేల ఇండ్ల బేస్ మెంట్ నిర్మాణాలు పూర్తి అయ్యాయని ఆయన వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





