– మ్యాజిక్ ఫిగర్ కోసం బేరసారాలు షురూ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీ ఏన్నికల ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 3 గంటల వరకు వెల్లడి అయిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 90కి పైగా మున్సిపాలిటీల్లో, బీఆర్ఎస్ 24 మున్సిపాలిటీల్లో విజయాలు సాధించాయి. అయితే పలుచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అందుకోక కొన్నిచోట్ల హంగ్ ఏర్పడింది. దాంతో ఆయా మున్సిపాలిటీల్లో హార్స్ ట్రేడింగ్‌కు తెరలేచింది. మ్యాజిక్ ఫిగర్ కోసం అప్పుడే బేరసారాలు మొదలయ్యాయి. చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో స్వతంత్రులు, ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకం కానున్నారు. మొత్తం 16 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వీటిల్లో పరకాల, అలంపూర్, నర్సాపూర్, జిన్నారం, కేసముద్రం, ఇస్నాపూర్, ఆసిఫాబాద్, జమ్మికుంట, జనగామ, కామారెడ్డి, అమరచింత, కోహీర్, దేవరకద్ర, ఆసిఫాబాద్, వేములవాడ, రాయికల్, జహీరాబాద్, మహబూబాబాద్, ఆలియాబాద్, బోధన్, గద్వాల, బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, ఇంద్రేశం, గుమ్మడిదల.. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ, మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్ నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, అశ్వారావుపేట, స్టేషన్ ఘన్పూర్, ఆందోలు-జోగిపేట, సదాశివపేట, హుజూరాబాద్, కొల్లాపూర్, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్‌ఘన్‌పూర్, మథిర మున్సిపాలిటీల్లో గెలిచింది. కాగా ,అనూహ్య రీతిలో వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. ఇక ఇతర పార్టీలు ఏ మున్సిపాలిటీలోనూ అధికారానికి దరిదాపుల్లో లేవు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ పరిధిలోని 24 వార్డులకు గానుబీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 8, బీజేపీ 4 స్థానాలను దక్కించుకున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు విస్తృత ప్రచారం నిర్వహించి అభ్యర్థుల గెలుపునకు తీవ్రంగా కృషిచేశారు.
జనగామలో ఇండిపెండెంట్లు కీలకం
జనగామలో హంగ్ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. దీంతో చైర్మన్ పీఠం కోసం నలుగురు స్వతంత్ర అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మిగిలిన వార్డుల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థిని పలువురు వ్యక్తులు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.