హోంగార్డుల భవిష్యత్తుకు భరోసా

– డీజీపీ శివధర్‌ రెడ్డి
– హోంగార్డుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సేవలో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల సేవలకు సముచిత గౌరవం దక్కాలనే ఉద్దేశంతో డిసెంబరు 6న రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హోంగార్డులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజును ఒక ఉత్సవంగా మాత్రమే కాక హోంగార్డుల సేవలను గుర్తించి వారి భవిష్యత్తుకు భరోసానిచ్చే ఉత్తేజపూరిత కార్యక్రమంగా నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి కీలక విధుల్లో హోంగార్డులు చూపుతున్న క్రమశిక్షణ, అంకిత భావాన్ని డీజీపీ ప్రశంసించారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అన్ని యూనిట్లలో హోంగార్డులతో పరేడ్‌ను నిర్వహించి శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నిర్వహణ, నేరాల నివారణ, విపత్తు నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్‌ వంటి విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన హోంగార్డులను ప్రత్యేకంగా గుర్తించి, వారిని సన్మానించాలని యూనిట్‌ అధికారులను ఆదేశించారు. వారి దినసరి డ్యూటీ అలవెన్స్‌ను రూ.921 నుండి రూ.1,000కు పెంచడం, ట్రాఫిక్‌ విధుల్లో ఉన్నవారికి 30% పొల్యూషన్‌ హజార్డస్‌ అలవెన్స్‌ చెల్లింపు, పరేడ్‌ అలవెన్స్‌ను రూ.200కు పెంచామని ఆయన వివరించారు. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకులలో అకౌంట్లు కలిగిన హోంగార్డులు విధి నిర్వహణలో మరణిస్తే దాదాపు రూ.33 లక్షల బీమా సౌకర్యం కల్పించడం, ప్రమాదాలు లేదా సహజ మరణం చెందినవారికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. నూతన హోంగార్డుల నియామకాల ప్రతిపాదన, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వైద్య సౌకర్యం, అర్హులైనవారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపు వంటి అంశాలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని డీజీపీ వెల్లడిరచారు. అంతేకాక హోంగార్డులు తమ సమస్యలను నేరుగా తెలియజేయడానికి వీలుగా పోలీసు అధికారులు వారితో మాట్లాడి ఆయా అంశాలను క్రోడీకరించి తన కార్యాలయానికి పంపాలని యూనిట్‌ అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నామని డీజీపీ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *