– కెసిఆర్ గుండెల్లో గుబులు మొదలైంది
– బిఆర్ఎస్ కారు టైరు మెల్లిగా పంక్చరవుతుంది
– అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
– కార్యకర్తల కృషితోనే గజ్వేల్ లో 90 కి పైగా సర్పంచ్‌లు గెలిచారు
– ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి
– సర్పంచులను సన్మానించిన మంత్రులు
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: గజ్వేల్ నియోజకవర్గంలో 90 కి పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టిందని, అందుకే తోలు తీస్తా అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఉపాధి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్ లకు గజ్వేల్ లో శుక్రవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిలతో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ నూతనంగా గెలుపొందిన సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాలతో సర్పంచ్, వార్డు మెంబర్లను గెలిచామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించే వరకు ఇదే ఉత్సాహంతో విజయయాత్ర కొనసాగాలని కోరారు. గ్రామాల్లోని సమస్యలను ఇన్‌చార్జ్ మంత్రికి విన్నవిస్తే పరిష్కరిస్తామన్నారు. ఎన్నికలు అయిపోయాయని, ఓడిన వారైనా, గెలిచిన వారైనా పార్టీ కోసం కృషి చేయాలన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేత కూర్చునేంత వరకు కార్యకర్తలు కష్టపడాలన్నారు. సర్పంచ్‌లు చెప్పిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపే బాధ్యత మంత్రులుగా తమదేనన్నారు. గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని, ఓడిన వాళ్ళు బాధపడకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంకటస్వామి మాట్లాడుతూ గజ్వేల్లోని 90పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన వారు సర్పంచులుగా గెలిచినందున కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందన్నారు. అందుకే తోలు తీస్తా అని కాంగ్రెస్ పార్టీ మీద పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ తనను గెలిపించిన గజ్వేల్ ప్రజల సమస్యలు పట్టించుకోలేదు కానీ తోలు తీస్తాడంట అంటూ ఎద్దేవా చేశారు. గతానికంటే ఎక్కువగా దుబ్బాకలో 56 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని, సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ క్యాండేట్ దొరకడమే కష్టంగా ఉండేదని, ఇప్పుడు ప్రతి స్థానంలో అభ్యర్థిని పెట్టామని, కొన్ని గెలిచామని అన్నారు. బీఆరెస్ టైర్ పంచరయి మెల్లిగా పోతుందన్నారు. కార్యకర్తల కష్టం వల్లే ఇన్ని స్థానాలు గెలుపొందామని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకాలు ప్రజలలో మంచి స్పందన ఉందన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండి వారి కష్టాలు సమస్యలు తెలుసుకోవాలని, అప్పుడే నాయకుడికి, ప్రజలకు మధ్య బాండింగ్ ఏర్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కూడా మన జిల్లాకు ఎక్కువ నిధులు ,ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వమని కోరానన్నారు. గెలిచిన సర్పంచులందరినీ ముఖ్యమంత్రితో కలిపిస్తానని సర్పంచులకు హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రజ్ఞాపూర్ హరిత రెస్టారెంట్ నుండి భారీ ర్యాలీతో సభాస్థలికి మంత్రులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి అధ్యక్షత వహించగా, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, భూo రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్, సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, కిష్టా గౌడ్, సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





