హెచ్‌ఎండీఏ ప్రణాళికలు భేష్‌

హెచ్‌ఎండీఏ కార్యాలయానికి జేడీఏ బృందం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప్రణాళికా చర్యలను అధ్యయనం చేయడానికి జైపూర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (జేడీఏ) నుంచి కమిషనర్‌ ఆనంది నాయకత్వంలోని ప్రతినిధి బృందం హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించింది. ప్లానింగ్‌ డైరెక్టర్‌ ప్రీతిగుప్తా, అదనపు చీఫ్‌ టౌన్‌ ప్లానర్‌ అంకుర్‌ దధీచ్‌, అసిస్టెంట్‌ టౌన్‌ ప్లానర్‌ రుషికేష్‌ కొల్టే ఉన్న ఈ ప్రతినిధి బృందాన్ని అమీరుపేటలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఇతర సీనియర్‌ అధికారులు స్వాగతించారు. ఈ సందర్భంగా స్రర్ఫరాజ్‌ అహ్మద్‌ హెచ్‌ఎండీఏ అభివృద్ధిపై సమగ్ర ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రస్తుత మాస్టర్‌ ప్లాన్లు, రోడ్డు డెవలప్‌మెంట్‌ ప్లాన్లు, ల్యాండ్‌ పూలింగ్‌ పథకాలు, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం-2050 కోసం రూపొందించిన సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ను వివరించారు. ఇందులో కాంప్రెహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌, ఆర్థికాభివృద్ధి ప్రణాళిక, బ్లూ-గ్రీన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లాన్‌లను ఏకీకృతంగా కలిపినది జీఐఎస్‌ ఆధారిత బేస్‌ మ్యాప్‌ ద్వారా మొత్తం మెట్రోపాలిటన్‌ ప్రాంతానికి ఆధారభూతంగా పనిచేస్తున్నదని తెలిపారు. అదనంగా తెలంగాణ ముఖ్యమైన పట్టణ ప్రాంతం కోసం త్రీడీ డిజిటల్‌ ట్విన్‌ అభివృద్ధి చేస్తుండటం, అలాగే కొత్త కాంప్రెహెన్సివ్‌ బిల్డింగ్‌ రెగ్యులేషన్స్‌ రూపకల్పనలో ఉన్నట్లు తెలిపారు. జేడీఏ ప్రతినిధి బృందం హెచ్‌ఎండీఏ దూరదృష్టి ప్రణాళిక, సాంకేతిక చర్యలను మెచ్చుకున్నది. హెచ్‌ఎండీఏ ప్రణాళికా కార్యక్రమాలు, మెట్రోపాలిటన్‌ అభివృద్ధిలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడం ఈ సందర్శన ఉద్దేశం. ఇలాంటి సంస్థల మధ్య పరస్పర విజ్ఞాన మార్పిడి, విజయవంతమైన నమూనాలను అనుసరించడం, ప్రజలే కేంద్రంగా ఉన్న పట్టణ పాలనను ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో ప్రయోజనం ఉంటుందని సర్ఫరాజ్‌ అహ్మద్‌ వివరించారు. సమావేశంలో హెచ్‌ఎండీఏ సభ్యుడు (ప్లానర్‌) ఎస్‌.దేవేందర్‌ రెడ్డి, ప్లానింగ్‌ డైరెక్టర్లు కె.విద్యాధర్‌, ఎం.రాజేంద్ర ప్రసాద నాయక్‌తోపాటు పలువురు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *