ఇది చరిత్రాత్మక బడ్జెట్

– పేదలు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత
– మోదీ హయాంలో రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు
– కేంద్ర బడ్జెట్‌పై ప్రసంగంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్

న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే చరిత్రాత్మక బడ్జెట్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కేంద్ర బడ్జెట్‌ను అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో రూపొందిన ఈ బడ్జెట్ సామాజిక భద్రత, మౌలిక సదుపాయాల విస్తరణ, యువత-రైతుల సాధికారతతోపాటు 2047నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునే స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను నిర్దేశిస్తోందని అన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జన్‌ధన్-ఆధార్–మొబైల్ త్రయం ద్వారా దిల్లీ నుంచి పంపే ప్రతి రూపాయి నేరుగా లబ్దిదారుల ఖాతాలకు చేరేలా వ్యవస్థను తీసుకొచ్చిందని, దీనివల్ల మధ్యవర్తుల పాత్ర, అవినీతి పూర్తిగా తగ్గిందని తెలిపారు. 2014కి ముందు మౌలిక సదుపాయాలపై మూలధన వ్యయం కేవలం రూ.2 లక్షల కోట్లుగా ఉండేదని గుర్తు చేసిన డాక్టర్ లక్ష్మణ్ నేడు అది ఆరు రెట్లు పెరిగి రూ.12.2 లక్షల కోట్లకు చేరిందన్నారు. రైల్వేలు, రహదారులు, విమాన మార్గాలు, జల మార్గాల అభివృద్ధి ఈ మార్పునకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో దిల్లీ నుంచి పంపిన నిధుల్లో కేవలం స్వల్ప భాగమే పేదలకు చేరేదని అప్పటి ప్రధాన మంత్రి స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు.

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో చేపట్టిన సంస్కరణల ఫలితంగా మధ్యతరగతి కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పన్ను రాయితీ లభించిందని చెప్పారు. ఈ బడ్జెట్ కేవలం లెక్కల పుస్తకం కాదని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునే రోడ్‌మ్యాప్ అని పేర్కొన్నారు. సంస్కరణలు, మార్పు అనే సిద్ధాంతంతో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రానికి నిధులు లేవని అంగీకరిస్తున్నారన్నారు. 2014కి ముందు తెలంగాణలో కేవలం 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులే ఉండేవని, గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్లతో మరో 5,000 కి.మీ రహదారులు నిర్మించిందని తెలిపారు. రైల్వేలకు యూపీఏ కాలంలో కేవలం రూ.836 కోట్లు కేటాయించగా ప్రస్తుతం తెలంగాణకే రూ.5,456 కోట్లు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, అమృత్ భారత్ పథకం కింద 40 స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. 100 శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె హైస్పీడ్ కారిడార్లు తెలంగాణకు మంజూరైనట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం వేరైనా రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. బీబీనగర్‌లో ఎయిమ్స్, ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, నిజామాబాద్‌లో పసుపు బోర్డు, కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణ వంటి కీలక ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం వల్లే వచ్చాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి, కమీషన్లు, బెదిరింపులు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట జిల్లా మక్తల్ 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఇలాంటి దారుణం జరగడం దారుణమన్నారు. మహదేవప్ప ఆత్మహత్య ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలుస్తుందని అన్నారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *