– పరిశ్రమలు, పెట్టుబడులపై తప్పుడు ప్రచారం తగదు
– నంబర్ వన్ పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
– ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: మాజీ సీఎం కేసీఆర్ పాలన ‘హైప్ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్’ అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘హోప్ క్రియేట్ చేసే వర్కింగ్ కల్చర్’తో ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. మీలాగా మాకు గాల్లో మేడలు కట్టడం రాదు. అరచేతిలో స్వర్గం చూపించడం అసలే రాదు. అబద్ధాల గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.రాష్ట్రానికి పరిశ్రమలు రావొద్దు.. పెట్టుబడులు రావొద్దు. ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావొద్దు. ఇదే బీఆర్ఎస్ పాలసీ అని అన్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న దిగ్గజ కంపెనీలను కించపర్చడం మంచిది కాదు. ఒక సీనియర్ నాయకుడిగా మీకిది తగదన్నారు. కేసీఆర్ గారూ.. మీ హయాంలో ఏ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా మీ కుటుంబం అనుమతి తప్పనిసరి. అవునా కాదా.. మేము ఆ ‘గేట్ పాస్’ కల్చర్ కు ఫుల్ స్టాప్ పెట్టాం. అందుకే ఈరోజు గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ కు తెలంగాణ బై ఛాయిస్ కాదు.. బై డెస్టినేషన్ గా మారింది. అందుకే ఇవాళ పరిశ్రమలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి అని చెప్పారు. కేసీఆర్ గారూ.. ఎక్కడో ఉండి పాలన సాగించిన మీకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడం ‘హైప్’ లాగే కనిపిస్తుంది. ఇది హైప్ కాదు.. ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న ‘హోప్’. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మేం చేసుకున్న రూ.5.75 లక్షల కోట్ల ఎంవోయూలు అబద్ధమైతే జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార దిగ్గజాలు కూడా గ్లోబల్ సమ్మిట్ కు రావడం అబద్ధమా? మీ హయాంలోనూ అనేక ఎంవోయూలు జరిగాయి. కానీ అన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టాయా? ఒక్కో ఎంవోయూ గ్రౌండింగ్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అది తెలిసి కూడా రెండేళ్లలో రూ.3.4 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చిన మాపై విమర్శలు చేయడం సరికాదు. ప్రతి ఎంవోయూను గ్రౌండింగ్ చేసే మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టాం. కానీ రియల్ ఎస్టేట్కో సమే అంటూ మీరు తప్పుడు ప్రచారం చేయడం తగదు. మేం రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి అవసరాలకనుగుణంగా అన్ని ఒకేచోట ఉండాలనే గొప్ప సంకల్పంతో ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు రూపొందించాం. మీ హయాంలో ఓ అధికారి మంచి పాలసీని రూపొందించారని చెప్పారు.. బాగుంది. కానీ ఆ పాలసీలో ఉన్న నిబంధనలను మీరు అమలు చేశారా? ఉత్తమ ఆఫీసర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి సెక్రటేరియట్ కే వెళ్లకుండా పాలన సాగించిన చరిత్ర మీది. ఇవాళ అధికారులకు స్వేచ్ఛనిచ్చి రాష్ట్రాభివృద్ధిలో వాళ్లను భాగస్వామ్యం చేస్తోంది మేం. వరంగల్ టెక్స్ టైల్ పార్క్ మీద పేటెంట్ మీదా? మరి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు.. ఒక ప్రణాళిక ప్రకారం మేం అసంపూర్తిగా మిగిలిపోయిన పార్క్ ను పూర్తి చేశాం. అక్కడికి దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చాం. దేశంలో ఇదే మొట్టమొదటి ఫంక్షనల్ పీఎం మిత్ర పార్క్. కేంద్రం నుంచి మా హయాంలోనే రూ.30 కోట్లు ఈ పార్కు అభివృద్ధికి తీసుకొచ్చాం. వాస్తవాలు మాట్లాడితే ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ లో పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. ఈ రంగాల్లో తెలంగాణ ఇప్పుడు టాప్ లో ఉందంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎకో సిస్టం అభివృద్ధికి వేసిన పునాదులే కారణం. మీరు తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతులను రూ.54వేల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మేం కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే రూ.2.43 లక్షల కోట్ల నుంచి రూ.3.23 లక్షల కోట్లకు తీసుకెళ్లాం. 2024 –25లో తలసరి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి(జీఎస్ డీపీ) తలసరి ఆదాయం దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తేల్చింది. 1. తెలంగాణ – రూ.3.87 లక్షలు, 2. కర్ణాటక – రూ.3.8 లక్షలు, 3. తమిళనాడు – రూ.3.61 లక్షలు, 4. మహారాష్ట్ర – రూ.3.09 లక్షలుకేసీఆర్ .. విమర్శలు చేసే ముందు ఒకసారి గతం కూడా చూసుకోండి. ఇది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం. ఇక్కడ పరదాలు లేవు, కేవలం ప్రగతి మాత్రమే ఉంది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అబద్ధాలు ప్రచారం చేసినా తెలంగాణను ప్రపంచ పటంలో నంబర్ వన్ పారిశ్రామిక రాష్ట్రంగా నిలబెడతాం. ఇందులో రాజీ పడబోం అని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





