రేవంత్ అవినీతి కోసమే ‘హిల్ట్‌’ పాల‌సీ

– 9292 ఎక‌రాల భూమి ధారాద‌త్తం కోస‌మే..
– ఒక‌ప్పుడు ప‌రిశ్ర‌మ‌ల‌ కోసం ఇచ్చిన భూములు
– నేడు ప్రైవేటు వ్య‌క్తుల‌కు అప్ప‌గింత‌
– ఇందుకు బీఆర్ఎస్ ఎంత‌మాత్రం అంగీక‌రించ‌దు
– ఈ అవినీతిని అడ్డుకొని తీర‌తాం
– మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 25:  కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5లక్షల కోట్ల అవినీతి స్కీమ్‌కి తెర లేపిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ అవినీతిలో భాగంగానే 9,292 ఎకరాల భూమి ధారాద‌త్తం చేసేందుకు హెచ్ ఐఎల్‌టీపీ పాలసీ తీసుకువచ్చిందన్నారు. బీఆర్ ఎస్‌వీ నాయకులతో సమావేశమైన కేటీఆర్ పలు అంశాలపై చర్చించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. గతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకి పారిశ్రామిక వ్యక్తులకుప్రభుత్వాలు ఇచ్చాయి. అప్పటి మార్కెట్ రేట్‌కి సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను అందించారు. కానీ ఈరోజు హైదరాబాద్‌లో ఉన్న 20 పారిశ్రామిక వాడలలోని 9,292 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమల కోసం, ప్రజల ఉపాధి కోసం వచ్చిన భూములను ఈరోజు ప్రైవేటు వ్యక్తులు అపార్ట్‌మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నద‌న్నారు. తాము గతంలో తీసుకువచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50% ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50% ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాత అవకాశం ఇచ్చాం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ధారాదత్తం చేస్తున్నద‌న్నారు. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లిస్తే చాలు అంటూ అప్పనంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నద‌న్నారు. ఈరోజు రేవంత్ రెడ్డితోపాటు ఆయన మనవడు, ముని మనవడు వరకు కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పాలసీ తీసుకువచ్చారు. ఈ పాలసీ ద్వారా ఆయన అంబానీ సరసన నిలవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది అన్నారు. ఈ భూముల దందా పైన వెంటనే ప్రజలను జాగ్రత్తపరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థి నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరంలో పార్కులకు, ఇళ్లకు, చివరికి స్మశానానికి కూడా జాగా లేకున్నా, ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములన్నింటినీ అప్పనంగా అప్పగిస్తున్నది. ఇదే అంశాన్ని ఈరోజు మన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జనరల్ బాడీ కౌన్సిలింగ్ సమావేశంలో నిలదీశారని తెలిపారు.  ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా చేస్తామంటే ఊరుకోమని, అది కాంగ్రెస్ పార్టీ అబ్బ జాగీరు కాదని ప్రశ్నించినట్లు తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, గురుకుల సమస్యలపై త్వరలో పోరుబాట చేప‌డ‌తామ‌న్నారు.

నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఆందోళనలు

విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలి. కాంగ్రెస్ అరాచకాలపై పోరాడి, ప్రతి విద్యార్థి ఒక యోధుడిగా ఎదగాలి. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు నిచ్చారు. చరిత్రలో దీక్షా దివ‌స్ నవంబర్ 29 ఒక గొప్ప మహా ఘట్టంగా నిలిచిపోతుంద‌న్నారు. దీక్షా దివాస్ ని ఘనంగా అన్ని యూనివర్సిటీలు అన్నీ కాలేజీల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలన్నారు. తన నివాసంలో విద్యార్థి విభాగం నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్  విద్యా రంగానికి స్వర్ణయుగం తీసుకువచ్చారని, గురుకుల విద్యా సంస్థలు, రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుతో లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారని గుర్తు చేశారు. గత పదేళ్లలో విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తోందని  మండిపడ్డారు. “గత పదేళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి తెరతీసింది. వారి అబద్ధాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉంది అని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. వేలాదిమంది విద్యార్థులను సమీకరించి, ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గురుకులాల్లో కల్తీ ఆహారం మొదలుకొని, విద్యార్థుల ఆత్మహత్యల వరకు అనేక విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థి విభాగం చేపట్టిన ‘గురుకుల బాట’తో ప్రభుత్వంలో కొంత చలనం వచ్చినప్పటికీ, అది కేవలం కాంగ్రెస్ నాయకుల నటనగానే మిగిలిపోయిందన్నారు. గురుకులాల దుస్థితిపై మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రతి విద్యార్థికి సోషల్ మీడియా ఖాతా ఉండాలని, సమకాలీన రాజకీయాలపై యువత గట్టిగా స్పందించాలని కేటీఆర్ సూచించారు. ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా విద్యార్థి గొంతుక బలంగా వినిపించాలి,” అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేవలం స్ధానిక సంస్ధలకే కాదని, విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, ఈ అంశంపై యువతను జాగృతం చేయాలన్నారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *