పారదర్శకంగా ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ పాలసీ

– బీఆర్‌ఎస్‌ వారిలా కావలసిన వారికి కట్టబెట్టం
– మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: బీఆర్‌ఎస్‌ నేతలు ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ను కావలసిన వారి కోసం, వ్యక్తుల కోసం చేశారని, అంతర్లీనంగా ఎంపిక చేసిన కొద్దిమందికే జరిగిందని, అందుకు పాలసీ లేదు, కేబినెట్‌ అనుమతి కూడా లేదు అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేబినెట్‌ మీటింగ్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రియల్‌ పార్కులో కావలసిన వారికి భూములను మార్పిడి చేశారంటూ ఆ నేతలు ఎన్ని ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ కన్వర్షన్లు చేశారు.. ఎవరెవరికి చేశారో త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం అని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అలా చేయడం లేదు.. హైదరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్ఫర్‌ (హిల్ట్‌) పాలసీని పారదర్శకంగా తీసుకువచ్చామని, హైదరాబాద్‌ మహానగరాన్ని కాలుష్య రహితంగా చేయడం, రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడం అజెండాగా ఈ పాలసీని తీసుకువచ్చామని వివరించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో లోతుగా చర్చించామని, భాగస్వాములతోనూ మాట్లాడడమేగాక కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతల మాదిరి వ్యక్తి కోసం, వ్యక్తుల కోసం తాము ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయడం లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందాలి.. ప్రతి సంవత్సరం ఖర్చు పెరుగుతోంది.. ప్రజలపై పన్నులు మోపే ఆలోచన లేదు.. ఆదాయం సమకూర్చుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అన్నారు. ఇండస్ట్రియల్‌ ‘హిల్ట్‌’ను పారదర్శకంగా తీసుకొచ్చి అందరికీ అవకాశం ఇస్తూ 50% ఎస్‌ఓఆర్‌ ప్రకారం 80 ఫీట్ల రోడ్లు ఉన్నవారికి అవకాశం ఇస్తే కన్వర్షన్‌ చేసుకుంటారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. నాచారం, మౌలాలి, ఉప్పల్‌, జీడిమెట్ల, బాలానగర్‌, కూకట్‌పల్లి వంటి ఇండస్ట్రియల్‌ కాలనీలు 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ అవతల ఉండేవి. పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేసి ఆనాడు ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. 50 ఏళ్ల కాలంలో హైదరాబాద్‌ నగరం పెద్ద ఎత్తున విస్తరించి ఇండస్ట్రియల్‌ పార్కుల చుట్టూ ఇళ్ళ నిర్మాణం పెద్దఎత్తున జరిగింది. నగరాన్ని కాలుష్యం నుంచి విముక్తి కలిగించేందుకు ప్రస్తుతం ఆ పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డు బయటకు తరలించాల్సి ఉంది అని చెప్పారు. దేశ రాజధాని ఢల్లీిలో కాలుష్య తీవ్రత పెరిగి పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందంటూ ఈ పరిస్థితి హైదరాబాదు నగరానికి రావొద్దు అనేది ప్రభుత్వం ఆలోచన అని అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రియల్‌ పార్కుల్లో ఉన్న వ్యక్తులను ఒత్తిడి చేసి బయటకు పంపలేమని, నగరాన్ని పొల్యూషన్‌ రెడ్‌, ఆరంజ్‌ జోన్ల నుంచి విముక్తి కల్పించాలని కోర్టులు సూచించాయని డిప్యూటీ సీఎం తెలిపారు. అందుకే పారదర్శకంగా సమగ్ర ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ పాలసీని తీసుకొచ్చామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *