ఏఐ సాయంతో హైటెక్‌ ‌కాపీయింగ్‌

– పట్టుబడ్డ ఇద్దరు యువకులు
– ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ఏఐ ‌సాయంతో నకలు కొట్టబోయి దొరికిన యువకుల వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. గతంలో నేరుగా చిట్టీలతో కాపీ కొట్టేవారు.  ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ ‌టెక్నాలజీని వాడి పరీక్షల్లో కాపీ కొట్టేద్దామనుకున్న ఇద్దరు యువకులను అధికారులు గుర్తించారు. ఈ ఘటన గత ఆదివారం హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో జరిగింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీ నాన్‌-‌టీచింగ్‌ ‌విభాగంలో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల నోటిఫికేషన్‌ ‌విడుదలయ్యింది. ఈ నెల 21న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యూనివర్సిటీ క్యాంపస్‌లో రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హర్యానాకు చెందిన అనిల్‌ (30) ‌హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్న సమయంలో అతని చెవిలో ఉన్న బ్లూటూత్‌ ‌డివైస్‌ ‌నుంచి పదేపదే బీప్‌ ‌సౌండ్‌ ‌రావడంతో ఇన్విజిలేటర్‌ ‌కు అనుమానం వచ్చి వెంటనే ఆ యువకుడిని తనిఖీ చేశారు. సోదాలో అనిల్‌ ‌షర్ట్‌కు అమర్చిన స్కానర్‌ ‌డివైస్‌ ‌బయటపడింది. అనిల్‌ ‌క్వశ్చన్‌ ‌పేపర్‌ను ఆ స్కానర్‌ ‌ద్వారా స్కాన్‌ ‌చేసి, బాత్‌రూంకు వెళ్లి ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌సాయంతో సమాధానాలు తెలుసుకుని, చెవిలో ఉన్న బ్లూటూత్‌ ‌ద్వారా వాటిని వింటూ జవాబులు రాస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు పరీక్ష హాలులోని ఇతర అభ్యర్థులను కూడా నిశితంగా సోదాలు చేశారు. హర్యానాకు చెందిన మరో యువకుడు సతీష్‌ ‌కూడా ఇదే తరహాలో హైటెక్‌ ‌పద్ధతిలో కాపీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న వర్సిటీ అధికారులు వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ ‌దేవేష్‌ ‌నిగమ్‌ ‌ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో ఉద్యోగ పరీక్షల్లో హైటెక్‌ ‌కాపీయింగ్‌ ‌ముప్పు మరోసారి వెలుగుచూసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *