రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్

– రికార్డుస్థాయి గరిష్ఠ డిమాండ్‌ను నెరవేర్చిన రాష్ట్రం
– భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నాం
– విద్యుత్ సంస్థలకు డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: విద్యుత్ డిమాండ్‌ను నెరవేర్చే అంశంలో రాష్ట్రం మరోసారి తన ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే గరిష్ట డిమాండ్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేసి నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన ఉన్నతాధికారులు, యావత్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనం అని పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభ

18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్రం సుమారు 19,900 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను నమోదు చేసిన మధ్యప్రదేశ్, అలాగే 19,600–20,600 మెగావాట్ల మధ్య గరిష్ట డిమాండ్ నమోదైన రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలకు సమానంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. భూభాగం, జనాభా పరంగా చిన్నదైనా తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటిందన్నారు. పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ఠ డిమాండ్‌ను రాష్ట్రం నమోదు చేసిందన్నారు. భౌగోళికంగా చిన్నదైనా అధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని, ఐటీ, ఔషధ తయారీ, తయారీ రంగం, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి దీనికి ప్రధాన కారణమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

వేగవంతమైన డిమాండ్ పెరుగుదల

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 2023-24 గరిష్ఠ డిమాండ్ 15,623 మెగావాట్లు (08.03.2024), 2024-25 గరిష్ఠ డిమాండ్ 17,162 మెగావాట్లు (20.03.2025), 2025–26 (మునుపటి గరిష్ఠం) 17,162 మెగావాట్లు, 2026 (ప్రస్తుతం) 18,139 మెగావాట్లు(03.03.2026) -కొత్త గరిష్ఠ దశలోకి ప్రవేశించామని వివరించారు.

భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా తెలంగాణ

తెలంగాణ కేవలం సమకాలీన అవసరాలను తీర్చడం మాత్రమే కాదు.. రాబోయే వేసవి గరిష్ఠ డిమాండ్‌లకు ముందస్తు ప్రణాళికలతో పూర్తిగా సిద్ధంగా ఉంది. బలమైన గ్రిడ్ వ్యవస్థ, ముందుచూపు ప్రణాళిక, సమన్వయంతో ఉన్న వ్యవస్థ మన బలం అని ఆయన తెలిపారు. తెలంగాణ విద్యుత్ రంగం అభివృద్ధిని ముందుకు నడిపేలా రూపుదిద్దుకుంది. కంట్రోల్ రూమ్‌ల నుంచి నుంచి ఫీల్డ్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ విజయాన్ని సాధించాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *