జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటుపై విచారణ పూర్తి

– తీర్పు 22కు వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్, ఏప్రిల్ 8: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తన తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్.కె.జోషిలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. జస్టిస్ ఘోష్ కమిషన్ చెల్లుబాటుపై వాదనలు ముగిశాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ పక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని పిటిషనర్లు పేర్కొన్నారు. తమపై అభియోగాలు మోపే ముందు తమ వాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని కోర్టుకు విన్నవించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను వెలికితీసేందుకే జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిషన్ తన నివేదికను అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగానే సిద్ధం చేసిందని తెలిపింది. విచారణలో భాగంగా పిటిషనర్లందరికీ నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని, కాబట్టి ఈ పిటిషన్లను కొట్టివేయాలని ప్రభుత్వం కోరింది. ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను ± విన్న తర్వాత బుధవారం వెలువరించాల్సిన తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *