– వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16 : తామిచ్చిన ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని పశుసంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ ప్రియాంక ఆలా, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.శ్రీనివాస్, నాగర్‌కర్నూల్, వనపర్తి, కలెక్టర్లలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టుధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని వారందరికీ ఫామ్-1 నోటీసులను జారీ చేసింది. ఈ నెల 30న జరిగే విచారణకు స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2023-24 ఏడాదికి ఇచ్చిన చేప విత్తనాలకు చెందిన నగదు చెల్లింపులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, అధికారుల ఆలస్యం వల్ల తమకు రూ.28లక్షలు బకాయి ఉండిపోయిందంటూ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామానికి చెందిన పుట్టా ఫిష్ సీడ్ ఫామ్ అధిపతి బాలరాజు, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ మొత్తాలను 3 వారాల్లో చెల్లింపులకు నిర్ణయం తీసుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. నెలలు గడిచినా హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ బాలరాజు ఇతరులు కోర్టుదిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రావణ్‌కుమార్ బుధవారం విచారణ జరిపి పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చారు. తాము ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో, జాప్యానికి కారణమేంటో నేరుగా విచారణకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పిటిషనర్ న్యాయవాది డీఎల్ పాండు వాదించారు.





