సూర్యాపేట ఓటర్ల జాబితాపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు

సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 24: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో కుల రిజర్వేషన్, వార్డు వారీ కేటాయింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించలేదని ఆరోపిస్తూ సూర్యాపేటకు చెందిన డి.శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి శనివారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆర్.శ్రీధర్ వాదనలు వినిపించగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం, మున్సిపల్ అధికారుల తరఫున సంబంధిత న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ పిటిషనర్ ఈనెల 19న తెలిపిన అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని ఆదేశించింది. కుల రిజర్వేషన్, వార్డు వారీ రిజర్వేషన్ కేటాయింపుల్లో ఉన్న లోపాలపై పిటిషనర్‌కు వాదించే అవకాశం కల్పించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌కు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా, అత్యవసరంగా పూర్తి చేయాలని, ముఖ్యంగా ఆదేశాల ప్రతిని స్వీకరించిన తేదీ నుంచి ఏడు రోజుల్లోపు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 20న మళ్లీ విచారణకు లిస్టు చేసింది. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ ఆదేశాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తుది ఓటర్ల జాబితా, కుల రిజర్వేషన్ అంశాలపై కలెక్టర్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీపై స్పష్టత వచ్చే అవకాశముంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *