గడువులోగా హైకోర్టు భవనాలు పూర్తి కావాలి

– క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన స్పెషల్‌ సీఎస్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు రోడ్లు, భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బుధవారం పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు ఆర్‌అండ్‌బి చీఫ్‌ ఇంజనీర్లు రాజేశ్వర్‌ రెడ్డి, లింగారెడ్డి, క్షేత్రస్థాయి ఇంజనీర్లు, కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులు, కన్సల్టెంట్లు ఉన్నారు. పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం సంబంధిత అధికారులు, సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సుమారు రూ.2,583 కోట్లు వ్యయంతో 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం రాష్ట్ర ఐకానిక్‌ బిల్డింగ్‌లా ఉండాలని, అధికారులు అందుకు తగ్గట్టుగా మనసుపెట్టి పనిచేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పనుల్లో జాప్యం కలగకుండా ఉండటానికి, కన్సల్టెంట్లు డ్రాయింగ్‌ షెడ్యూల్‌ను ముందుగానే అందించాలని, దీనివల్ల కాంట్రాక్ట్‌ సంస్థ అవసరమైన సిబ్బందిని, యంత్రాలను, సామగ్రిని సిద్ధం చేసుకోవడానికి వీలవుతుందని అన్నారు. ఒప్పందం ప్రకారం నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్ట్‌ సంస్థను ఆదేశించారు. పనుల పురోగతిపై శాఖాపరమైన అధికారులు కన్సల్టెంట్‌, కాంట్రాక్టర్‌తో తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జ్యుడీషియల్‌ అధికారుల సూచనల మేరకు సవరించిన ప్లాన్లను వెంటనే సిద్ధం చేసి అనుమతులు తీసుకోవాలని కన్సల్టెంట్లను ఆదేశించారు. అలాగే జోన్‌ 2కి సంబంధించిన అటవీ శాఖ అనుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని వికాస్‌ రాజ్‌ చీఫ్‌ ఇంజనీర్‌కు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *