– భూదాన్ బోర్డును ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: పేదల గూడు కోసం మహోన్నత లక్ష్యంతో ఎంతోమంది మహానుభావులు దానంగా ఇచ్చిన భూదాన్ బోర్డు భూములను రక్షించాలనే యోచన బోర్డు అధికారులకు లేకుండా పోయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్క గజం భూమిని రక్షించాలన్న చిత్తశుద్ది భూదాన్ బోర్డుకు ఉన్నట్లు కనబడడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నాగారం, శంషాబాద్ ప్రాంతాల్లోని వాటిపై వివాదానికే బోర్డు పరిమితం కాకుండా యావత్ రాష్ట్రంలోని భూదాన్ భూముల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. దాతలు ఎంత భూమి ఇచ్చారో, ఎంత భూమిని పేదలకు పంచారో, ఇంకా ఎంత భూమి ఉందో, వివాదంలో ఎంత భూమి ఉందో వంటి వివరాలను అందజేయాలన్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో పలు సర్వే నెంబర్లలోని భూదాన్ భూముల్లో అవకతవకలపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని, విచారణ కమిషన్ వేయాలనే పిటిషన్లను జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారించారు. భూదాన్ బోర్డు తరఫు న్యాయవాది కిరణ్ వాదనలు వినిపిస్తూ నాగారంలోని సర్వే నెం.181, 182లో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు ఉందని, మహేశ్వరం మండలంలో ఉన్న భూమి వివరాలు సమర్పించినట్లు తెలిపారు ఈ భూములన్నీ 22ఎ కింద నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ కమిషన్ ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఇది కేవలం ప్రైవేటు వివాదమని చెప్పారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూములపై విచారణ జరపాలని కోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందన్నారు. సర్వే నెం 194, 195లలో భూదాన్ భూములు లేవని ప్రభుత్వం, భూదాన్ బోర్డు తేల్చి చెప్పాయని, అందువల్ల ఈ సర్వే నెంబర్లలో లావాదేవీలు నిర్వహించరాదన్న మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని ఐఏఎస్, ఐపీఎస్ తరపు న్యాయవాదులు కోరారు. ఆ అధికారుల తరపు న్యాయవాదులు కమిషన్ ఆఫ్ ఎంక్వరీస్ చట్టంలోని సెక్షన్ 3కి సంబంధించి సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టులతోపాటు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం విచారణ కమిషన్ ఏర్పాటు చేయడానికి వీలులేదని చెప్పారు. కమిషన్ ద్వారా విచారణ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ వ్యక్తిగత వివాదాలకు సంబంధించిన చిన్న విషయాలపై కాదన్నారు. గురువారం జరిగే విచారణలో మధ్యంతర ఉత్తర్వుల సవరణ వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు ప్రకటించింది.





