అధిక ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు

ఏప్రిల్ ఆరంభం నుండే రాష్ట్రంలో  భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుండే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. అనేక జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు  దాటుతుండటంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 జిల్లా ల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆయా ప్రాంతాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, గత ఏడాదితో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నాడు ఖమ్మం జిల్లా (తిరుమలాయపాలెం): 41.6, భద్రాద్రి కొత్తగూడెం (దుమ్ముగూడెం) 41.5,నల్గొండ (నేరేడుగొమ్మ) 41.5,సూర్యాపేట (మేళ్లచెరువు) 41.4,జనగామ (పాలకుర్తి) , వరంగల్ (సంగెం): 41.2,హైదరాబాద్ 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర  వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్న నేపథ్యంలో, వడగాల్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తూ అడ్వైజరీ (ముందస్తు హెచ్చరిక) జారీ చేసింది. ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 13 వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, పలు జిల్లాల్లో తీవ్రమైన ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  అంచనా వేసిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి.

రాష్ట్రం ఈ ఏడాది తీవ్ర ఉష్ణోగ్రతలతో అగ్నిగోళంగా  మారుతోంది. ప్రతి ఏడాది వేసవి తీవ్రత పెరుగుతూనే ఉన్నా, ఈసారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ దాటుతుండగా, ప్రజల ఆరోగ్యం, జీవన విధానం, ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు, ప్రజలు కలిసి సమన్వయంతో ముందుకు రావాల్సిన అవసరం అత్యంత అత్యవసరంగా మారింది.

వాతావరణ మార్పులు (క్లైమేట్ చేంజ్), పట్టణీకరణ, చెట్ల నరుకుడు, నీటి వనరుల తగ్గుదల వంటి కారణాలు ఈ వేడి తీవ్రతకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. నగరాల్లో కాంక్రీట్ అరణ్యాలు పెరిగిపోవడం వల్ల “హీట్ ఐలాండ్ ఎఫెక్ట్” అధికమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీటి కొరత, వృక్ష సంపద తగ్గిపోవడం వల్ల పరిస్థితి విషమిస్తోంది.ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలి. ముఖ్యంగా ఆరోగ్యశాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. ప్రతి జిల్లాలో హీట్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడం అత్యవసరం. పబ్లిక్ ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యాలు కల్పించడం, తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేయడం, కూలీలకు మధ్యాహ్నం సమయంలో పనులు నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ హాస్పిటల్స్   ల్లో హీట్ స్ట్రోక్ చికిత్సకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలి. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో కూడా అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచాలి. విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా కల్పించడం కూడా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు.పాఠశాలల విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం సమయాల్లోనే తరగతులు నిర్వహించడం, అవసరమైతే సెలవులు ప్రకటించడం వంటి చర్యలు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడగలవు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల మధ్య బయటికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. అవసరమైతే తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం, నీరు ఎక్కువగా తాగడం, లైట్ కలర్ దుస్తులు ధరించడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. హీట్ స్ట్రోక్ లక్షణాలు (తలనొప్పి, మలబద్ధకం, అలసట, చెమటలు రావడం తగ్గిపోవడం) కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ  వంటి పానీయాలు తీసుకోవడం మంచిది.

గతంలో ఎండా  కాలంలో అగ్నిప్రమాదాలు కూడా పెరగగండం గమనించాం  . పొలాల్లో పొలుసులు కాల్చడం, చెత్తను తగలబెట్టడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లు కూడా అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాబట్టి విద్యుత్ వైరింగ్‌ను సమయానుకూలంగా తనిఖీ చేయడం అవసరం. అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా అడవి శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అప్రమత్తత పెంచాలి. ఫైర్ సర్వీస్ శాఖ కూడా అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి.

ప్రస్తుతం తీసుకునే తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం అత్యంత కీలకం. పట్టణాల్లో గ్రీన్ కవరేజ్ పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలను కొంతవరకు తగ్గించవొచ్చు. నీటి వనరులను సంరక్షించడం, రైన్  వాటర్ హార్వెస్టింగ్‌ను ప్రోత్సహించడం అవసరం. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా మాత్రమే దీర్ఘకాలిక మార్పులు సాధ్యమవుతాయి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలి.

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒక హెచ్చరిక. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, మన చర్యల ఫలితం కూడా. ప్రభుత్వం, అధికారులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి. అదే సమయంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సహకరించాలి. అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చర్యలే రేపటి తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వేడి తగ్గకపోయినా, దాని ప్రభావాన్ని తగ్గించగల సామర్థ్యం మన చేతుల్లోనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *