– మృతదేహాలను గుర్తించే ప్రక్రియ సాగుతోంది
– సౌదీ ప్రభుత్వం డెత్ సర్టిఫికెట్ ఇస్తుంది
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: సౌదీ అరేబియాలో ఇవాళ ఉదయం మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో 46 మంది సజీవదహనం అయ్యారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. ఇందులో 45 మంది హైదరాబాద్ కు చెందినవారు. అందులోనూ ఎక్కువమంది సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి చెందినవారున్నారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ఈ విషయంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో మాట్లాడాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి ఆదేశాల మేరకు.. సౌదీ అరేబియా ప్రమాద ఘటనకు సంబంధించిన సమన్వయం కోసం ప్రత్యేక బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిస్తోందన్నారు. అంతకుముందు, సౌదీ అరేబియాలో భారత దౌత్యవేత్త సుహేల్ అజాజ్ ఖాన్ తో నేను స్వయంగా మాట్లాడానన్నారు. ఈ ఘటనలో గాయపడి హాస్పిటల్ లో ఉన్న వ్యక్తికి నిపుణులైన డాక్టర్ల సమక్షంలో అవసరమైన వైద్యసేవలను అందిస్తున్నారన్నారు. ఘటనలో సజీవ దహనం అయిన మృతదేహాలను సౌదీ ప్రభుత్వం గుర్తించేపనిలో ఉంది. దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తోంది. ఇవాళ రాత్రివరకు మృతదేహాలను గుర్తించి సౌదీ దేశం తరపున డెత్ సర్టిఫికెట్స్ జారీ చేయనున్నారని భారత దౌత్య కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై సౌదీ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ చేపట్టిందన్నారు. మృతదేహాల గుర్తింపు తదితర అంశాలకు సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వంతో.. సౌదీలోని భారత ఎంబసీ అధికారులు మాట్లాడుతున్నారు. మృతుల కుటుంబీకులతో చర్చించి.. వారి సూచనల మేరకు మృతదేహాలపై నిర్ణయం తీసుకోనున్నారు. వీరి సూచనల ఆధారంగానే.. కేంద్ర ప్రభుత్వం దీనిపై ముందుకు వెళ్లనుందన్నారు.
పత్తి కొనుగోలుపై అధికారులతో మాట్లాడాం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆదివారం రాత్రి రాజ్ భవన్‌లో తనను కలిసి ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇవాళ టెక్స్‌టైల్స్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులను పిలిపించుకుని మాట్లాడాను. ఆన్ లైన్‌లో మంత్రి తుమ్మల, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జిన్నింగ్ మిల్ అసోసియేషన్‌కు సంబంధించిన వారితో మాట్లాడాం. ఎలాంటి భేషజాలు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించుకుని రైతలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పామన్నారు. .పత్తి కోనుగోలు కేంద్రాల్లో రైతులకు సమస్యలు లేకుండా చూసుకోవాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. తెలంగాణలోని అన్ని జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తి కొనుగోలు చేయాలనేది జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ డిమాండ్. దీన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఇవాళ 200కుపైగా కొనుగోలు కేంద్రాలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పాలసీ ప్రకారం పత్తి కొనుగోలు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మరిన్ని జిన్నింగ్ మిల్స్ కావాలని ప్రతిపాదిస్తే వాటిని కూడా ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నాం. రేపు సీసీఐ చైర్మన్, ఇతర అధికారులు తెలంగాణకు వెళ్తున్నారు. అక్కడ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమై పత్తి సేకరణలో ఉన్న ఇబ్బందులను దూరం చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. పత్తి కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, వచ్చే ఏడాది మార్చి వరకు కొనుగోలు చేస్తామని, కాబట్టి దళారులకు అమ్ముకోవద్దని చెప్పారు. తేమ ఎక్కువగా ఉంటే కాస్త డ్రై చేసుకుని మిల్లుకు తీసుకెళ్లండి తప్ప ఆందోళన చెంది దళారులకు అమ్ముకోవద్దని కేంద్రం కోరుతోందన్నారు. రైతులు పండిరచిన మొత్తం పత్తిని కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి కేబినెట్ మీటింగ్‌లో సూచించారన్నారు. కపాస్ యాప్ ద్వారా రైతులు ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చనే విషయాలు తెలియజేసేలా పనిచేస్తున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.85వేల కోట్ల విలువైన పత్తిని తెలంగాణలో కొనుగోలు చేశామన్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. జిన్నింగ్ మిల్స్ సమ్మెచేయడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల ఆధారంగా ఎల్1, ఎల్ 2, ఎల్ 3 అనే లిస్ట్ రెడీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే రాష్ట్రంలోని 345 జిన్నింగ్ మిల్స్ కూడా ఓపెన్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయించాలి. అది రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశం. రైతులకు ఎలాంటి నష్టం జరగొద్దనేది మా ఆలోచన. తుమ్మల కూడా జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ వారితో మాట్లాడి సమ్మె విరమించాలని కోరారు. దీనికి వారు అంగీకరించారని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





