– ప్రతిభను కూడా పరిగణించాలి
– విద్యార్థినిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: అనారోగ్యం వల్ల ఎవరైనా విద్యార్థికి హాజరు శాతం తగ్గితే దానిని తీవ్రంగా పరిగణించొద్దని ఉన్నత విద్యా శాఖకు హైకోర్టు ఆదేశించింది. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు పిటిషనర్‌ను అనుమతించాలన్నది. ఇంజనీరింగ్ మూడో ఏడాది (2024-25) సెకండ్ సెమిస్టర్ పరీక్షలు రాయకుండా తనకు కాలేజీ ఇచ్చిన సర్క్యులరును మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) బీటెక్ విద్యార్థిని కొండపర్తి మాన్విత హైకోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్ కె.శరత్ విచారించి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి వాదిస్తూ పరీక్ష రుసుమును పిటిషనర్ చెల్లించారని, అనారోగ్యం కారణంగా కాలేజీకి హాజరు కాకపోవడంతో మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించినప్పటికీ దానిని పరిగణపలోకి తీసుకోలేదని చెప్పారు. వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందన్నారు. హాజరు 65 శాతం లేదని, 49.33 శాతమే ఉందంటూ సర్క్యులర్ జారీ చేశారన్నారు. వాదనల తర్వాత హైకోర్టు కాలేజీ జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేసింది.





