– తీన్మార్ మల్లన్న పెట్టిన కేసును డిస్మిస్ చేసిన హైకోర్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: మేడిపల్లి పోలీసు స్టేషన్ లో బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు, బిఆర్ఎస్ సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిలపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును శుక్రవారం హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలతో ప్రతిష్ఠను దెబ్బతీశారని తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కేటీఆర్, జగదీశ్ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ ను అనుమతిస్తూ జస్టిస్ మౌసమీ భట్టాచార్య శుక్రవారం తుది ఉత్తర్వులను జారీ చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది టి.వి.రమణారావు వాదిస్తూ, రాజకీయ కక్షసాధింపుతో కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్లు వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. వాదనలపై హైకోర్టు.. ఫిర్యాదుదారుడి ఆరోపణలకు ఆధారాలు లేవంది. మేడిపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.



