– ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేత హిడ్మా హతం
– మొత్తం ఆరుగురు మావోల హతం
మారేడుమిల్లి, నవంబర్ 18: మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మరో అగ్రనేత హిడ్మా సైతం నేలకొరిగాడు. వొచ్చే మార్చి లోగా మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకనుగుణంగా ఆపరేషన్ కగార్‌తో బలగాలు దూసుకుపోతున్నాయి. తాజాగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్ ఉన్నారు. హిడ్మాపై రూ.కోటి, ఆయన భార్యపై రూ.50 లక్షల రివార్డు ఉన్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూర్వాటి గ్రామంలో జన్మించిన మద్వి హిడ్మా స్థానిక మూరియా తెగకు చెందిన వ్యక్తి . బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్నవయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుపొందారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ఈ క్రమంలో మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 1981లో జన్మించిన హిడ్మా 10వ తరగతి వరకు చదువుకున్నాడు. 2000 ప్రారంభంలో మావోయిస్ట్ ఉద్యమంలో చేరి క్రమంగా అగ్రస్థానానికి ఎదిగాడు. ప్రస్తుతం సీపీఐ (మావోయిస్ట్), పీఎల్‌జీఏ బెటాలియన్ 1 కమాండర్‌గా దండకారణ్య ప్రాంతంలో (ఛత్తీస్‌గఢ్, బీజాపూర్, దంతేవాడ ప్రాంతాలు) పనిచేస్తున్నాడు. 2010లో జరిగిన దంతేవాడ దాడి (76 సీర్పీఎఫ్ సిబ్బంది హతం), 2013 జీరామ్ ఘాటి నరమేధం వంటి పలు పెద్ద దాడుల్లో ప్రధాన సూత్రధారి హిడ్మా అని ఆరోపణలు ఉన్నాయి. ఏడాది హిడ్మా సీపీఐ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పదోన్నతి పొందినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. హిడ్మాను పట్టుకోవడం కోసం పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు కూడా ప్రకటించారు. అడవుల భౌగోళిక పరిజ్ఞానం, గెరిల్లా యుద్ధ వ్యూహాలు, స్థానిక నెట్‌వర్క్‌లను ఉపయోగించడంలో హిడ్మా సిద్ధహస్తుడు. దీంతో అతడిని భద్రతా దళాలు చాలా కాలం పట్టుకోలేకపోయాయి. 2004 నుంచి ఇప్పటివరకు అతను 20కి పైగా ప్రధాన దాడుల్లో పాల్గొన్నట్లు భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వేలాది మంది సిబ్బందితో పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్లు కూడా హిడ్మాను పట్టుకోలేకపోయాయి. ఎట్టకేలకు మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో హిడ్మా, అతడి అనుచరులు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు చిక్కింది. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో హిడ్మాతో సహా ఆరుగురు మరణించినట్టు పోలీసులు తెలిపారు.
హిడ్మా సహా ఆరుగురు మృతిచెందారని ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా వెల్లడి
రంపచోడవరం: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఉదయం 6-7 గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. ఎన్‌కౌంటర్ వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌తో కలిసి ఆయన వెల్లడించారు. రెండు రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టామని, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. మావోయిస్టుల నుంచి వివిధ రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మరోవైపు కృష్ణా జిల్లాతోపాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో మరో ఐదుగురు మావోయిస్టులు తప్పించు కున్నారని చెప్పారు. ఇటీవల మావోయిస్టులకు సహకరిస్తున్న 31 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఇంకా మరో 26 మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని అడిషనల్ డీజీ తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌కి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మావోయిస్టులు ఛత్తీస్‌గడ్‌కు చెందినవారని గుర్తించామని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నామని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





