ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలి

~ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి
– నష్టపరిహారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
– ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు

మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో వెళ్లారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డిలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాలేదు. దీంతో సాయంత్రం 5.20 గంటలకు మెదక్‌ పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. మెదక్‌ జిల్లాలో వరద పరిస్థితులపై అధికారులతో ఎస్పీ కార్యాలయంలో సమీక్షించిన అనంతరం వరదల తీవ్రతపై ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించి 6.20గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆకస్మికంగా సంభవించేవే ప్రకృతి విపత్తులు అని, అలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఆస్తి, పంట, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. యుద్ధప్రాతిపదికన పంట, ఆస్తి నష్టం, ప్రాణనష్టాన్ని అంచనాలకనుగుణంగా నష్టపరిహారానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని చీఫ్‌ సెక్రటరీని ఆదేశించారు. మెదక్‌ జిల్లాలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తుతుండగా వాగులు, చెరువులు ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వరద నష్టాలను అంచనాలు వేస్తూ శాశ్వత ప్రాతిపదికన హై లెవెల్‌ బ్రిడ్జిలు కట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
పంట నష్టాన్ని అంచనా వేసినప్పుడు ఫోటో క్యాప్చర్‌, వీడియో క్యాప్చర్‌ ద్వారా జిల్లాలో జరిగిన సమగ్ర వివరాలను భద్రపరచాలని సూచించారు వర్షపాత నమోదు వివరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు పలు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాల యూరియా కొరత విషయంలో బఫర్‌ స్టాక్‌ ప్రదర్శిస్తున్నామని, రైతులు రాబోవు పంటలకు కూడా ఇప్పటినుండే యూరియా కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని, నానో యూరియాపై రైతులకు అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డి, పీసీసీ చీప్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ రావు, మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ నగేష్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *