– త్వరగా వచ్చి వెళ్లేందుకు సదుపాయం
– గద్దెల పునరుద్ధరణ పనులు పూర్తి
– మంత్రి దనసరి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, జనవరి 22: మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
గతంలో కాలినడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు నేడు ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్ పై రావడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థవారు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వృధా కాకుండా హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని, హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు తిరిగి మేడారం నుండి హనుమకొండ కు వెళ్లేందుకు అతి తక్కువ ధరలలో ఒక్కొక్కరికి 31 వేల రూపాయల టికెట్ నిర్ణయించిందని, అంతేకాకుండా మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించడానికి 4 వేల 8 వందల రూపాయల టికెట్ ను ఖరారు చేశారని వివరించారు. గతంలో మహా జాతర సందర్భంగా అప్పటి పాలకులు నామమాత్రంగా నిధులు కేటాయించగా నేడు రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 2 వందల 51 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. నేటి నుండి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా సేవలందిస్తున్న థంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వీస్ నిర్వహిస్తుంది.బుకింగ్ వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 9676320139, 8530004309, 7660939509.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





