హైదరాబాద-విజయవాడ మధ్య రెండో రోజూ రద్దీ

– భారీగా బారులు తీరిన వాహ‌నాలు
– ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల‌ని పోలీసుల సూచన

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్‌-‌విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. వరుసగా రెండో రోజు శనివారం ఉదయం హైవేపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌, ‌పంతంగి టోల్‌ ‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఎంజీబీఎస్‌, ‌జేబీఎస్‌లలో రద్దీ పెరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, ‌తార్నాక కూడళ్లు సందడిగా మారాయి. రద్దీకినుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మరోవైపు రైల్వే స్టేషన్లలో కూడా రద్దీ పెరిగింది. ప్రతి ఆదివారం చౌటుప్పల్‌లో సంత జరుగుతుంది. ఆ రోజు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ ట్రాఫిక్‌ ‌బాధలు తప్పాలంటే ఇలా కొత్త మార్గాల్లో వెళ్లడం ఉత్తమం అని పోలీసులు సూచించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. హైవేపై వెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ‌పట్టణంలో నారాయణపురం రోడ్డును మూసివేశారు. వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టినట్లు టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా దిల్‌సుఖ్‌నగర్‌ ‌నుంచి చౌటుప్పల్‌కు ఒక గంటలో చేరుకోవచ్చు. కానీ నిరుడు ’భోగి’ ముందు రోజు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. అంతకు రెండు రోజుల ముందు కూడా చాలా సమయం పట్టింది.

ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి

జాతీయ రహదారిపై అండర్‌పాస్‌ ‌వంతెన, సర్వీసు రోడ్డు పనులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ‌నుంచి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడే బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం మేలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్‌ ‌హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌ ‌నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్‌పల్లి వరకు వెళ్లి అద్దంకి జాతీయ రహదారిపై నుంచి వెళ్తుంటారు. వీరు విజయవాడ హైవే మీదుగా వస్తే హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, ‌చౌటుప్పల్‌, ‌పంతంగి టోల్‌ ‌ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. పదుల కిలోమీటర్ల దూరం పెరిగినా హైదరాబాద్‌-‌నాగార్జునసాగర్‌ ‌హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఓఆర్‌ఆర్‌ ‌దుగా వెళ్లాలనుకునేవారు బొంగుళూరు గేట్‌ ‌వద్ద ఎగ్జిట్‌ ‌తీసుకొని.. నాగార్జునసాగర్‌ ‌హైవేపైకి వెళ్తే సరిపోతుంది.  ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కట్‌పల్లి దాటితే వీరికి ట్రాఫిక్‌ ‌తిప్పలు తప్పినట్లే. హైదరాబాద్‌ ‌నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్‌ఆర్‌ ‌పైకి వెళ్లి ఘట్‌కేసర్‌లో ఎగ్జిట్‌ ‌తీసుకొని వరంగల్‌ ‌హైవేలోకి ప్రవేశించొచ్చు. సికింద్రాబాద్‌, ‌తార్నాక, ఉప్పల్‌ ‌మీదుగా కూడా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు.

 

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో సంక్రాంతి రద్దీ   

సంక్రాంతి పండగ నేపథ్యంలో సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌ప్రయాణికులతో కోలాహలంగా మారింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో  రైల్వే స్టేషన్‌ ‌ప్రాంగణమంతా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. దీంతో రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా స్వగ్రామాలకు బయలుదేరారు. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌పునర్నిర్మాణ పనులు జరుగుతున్న ప్పటికీ.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, మహిళలు, చిన్నారులు పండుగ జరుపుకొనేందుకు పల్లెబాట పట్టారు. అలాగే బస్టాండ్‌లో కూడా రద్దీ కనిపించింది. బస్సుల కోసం సామన్యులు పరుగులు తీసారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *