– తడిసి ముద్దయిన నగరం
– ఇబ్బందులు పడ్డ నగర వాసులు
– పటాన్‌చెరు వద్ద హైవేపై నిలిచిన ట్రాఫిక్
- కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 26: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శుక్రవారం కూడా భారీ వర్షం కురుస్తుండటంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం అప్రమత్తమైంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించింది. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరింది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. మరోవైపు నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఛత్రినాక, తార్నాక, హబ్సిగూడ, నాచారం, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్, ప్రగతినగర్, ఆల్విన్ కాలనీ, చార్మినార్, యూకత్‌పురా, ఓయూ క్యాంపస్, హైదర్‌నగర్, బాచుపల్లి, వివేకానందనగర్, చార్మినార్, చాంద్రయణగుట్ట, బహదూర్‌పురా, లాలాపేట్, మల్లాపూర్, ఉప్పుగూడ, బార్కస్, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్ మంజీరా పైపులైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో రైల్వే అండర్ పాస్‌లోకి వరద నీరు చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మియాపూర్ మంజీరా పైపు లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మై హోం మంగళ మార్గంలో రైల్వే అండర్‌పాస్‌ను సైబరాబాద్ కమిషనర్ పరిశీలించారు. ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి 65వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా కిలోటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. దీంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
పలు విమానాల దారి మళ్లింపు
భారీ వానల కారణంగా పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కోల్‌కతా-హైదరాబాద్ ముంబై – హైదరాబాద్, పూణే నుంచి శంషాబాద్‌కు రావాల్సిన మూడు ఇండిగో విమానాలను విజయవాడకు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల ప్రభావం ఇలాగే ఉంటే మరికొన్ని విమానాలను కూడా దారి మళ్లించే అవకాశాలున్నాయని వెల్లడించారు. అలాగే విమాన రాకపోకలు కూడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. విమానాల రాకపోకల ఆలస్యం, మళ్లింపు విషయాన్ని ప్రయాణికులు గమనించాలని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





